ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ అండ్ సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసేందుకు సరికొత్త రూట్ ఎంచుకున్నారు. షూటింగ్ కోసం పదే పదే హైదరాబాద్ వెళ్లడం వల్ల ప్రభుత్వ పనులకు ఇబ్బంది కలగకూడదని ఆయన భావిస్తున్నారు. అందుకే తన ఆఫీస్ ఉన్న మంగళగిరినే ఇప్పుడు మినీ ఫిలిం హబ్‌గా మార్చేస్తున్నారు. తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా కోసం అక్కడ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మంగళగిరిలోని పవన్ కార్యాలయానికి అతి దగ్గర్లోనే మూడు ప్రత్యేకమైన సెట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఒకటి భారీ సెట్ కాగా, మిగతా రెండు చిన్న సెట్లు అని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచే సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ ఇక్కడే మొదలుకానుంది. ఇలా ఆఫీస్ పక్కనే సెట్లు ఉండటం వల్ల పవన్ తన విధులకు ఆటంకం కలగకుండానే, ఖాళీ సమయాల్లో మేకప్ వేసుకుని షూటింగ్‌లో పాల్గొనవచ్చు. ఇది పవన్‌కు మాత్రమే సాధ్యమయ్యే ప్లాన్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
గతంలో ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల విషయంలో కూడా పవన్ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. తన రాజకీయ కార్యకలాపాలకు దగ్గర్లో సెట్లు వేయించుకుని షూటింగ్స్ పూర్తి చేశారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌కు కూడా అదే రిపీట్ అవుతోంది. ఈ పద్ధతి వల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడంతో పాటు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం కూడా పవన్‌కు దక్కుతుంది.
వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పక్కా కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో పవన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. సురేందర్ రెడ్డి మార్క్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం మంగళగిరిలో నిర్మిస్తున్న ఈ సెట్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించే ఛాన్స్ ఉందట.