పహిల్వాన్

  • September 12, 2019 / 06:27 PM IST

“ఈగ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటుడు సుదీప్. అభినయ చక్రవర్తి అని కన్నడిగులు ముద్దుగా పిలుచుకొనే సుదీప్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “పలివాన్”. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో “పహిల్వాన్” పేరుతో అనువదించి విడుదల చేశారు. మరి సుదీప్ కథానాయకుడిగా ఇతర భాషల్లో మంచి విజయం అందుకొన్నాడో లేదో చూద్దాం..!!

కథ: పహిల్వాన్ కృష్ణ (సుదీప్) ఓ అనాధ. అతనికంటూ ఎవరూ లేకపోయినా.. అందర్నీ తన అనుకునే మనస్తత్వం కలిగిన కృష్ణను కన్న కొడుకులా సాకుతాడు సర్కార్ (సునీల్ శెట్టి). నేషనల్ లెవల్ కుస్తీ పహిల్వాన్ గా కృష్ణను తీర్చిదిద్దడం కోసం అతడ్ని ప్రేమ, పెళ్లి, అమ్మాయిలు వంటి వాటికి దూరంగా పెంచుతాడు. కానీ.. సర్కార్ ఏదైతే కృష్ణ జీవితంలో జరగకూడదు అనుకున్నాడో.. రుక్మిణి (ఆకాంక్ష సింగ్) రాకతో అదే జరుగుతుంది. ఆ తర్వాత చోటు చేసుకొన్న కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా కృష్ణ తనకు గాడ్ ఫాదర్ లాంటి సర్కార్ మరియు తన గోల్ నుండి దూరమవుతాడు. అనంతరం పహిల్వాన్ కాస్తా బాక్సింగ్ రింగ్ లోకి దూకుతాడు.

అందుకు ప్రేరేపించిన కారణాలేమిటి? చివరికి ఎం జరిగింది? అనేది “పహిల్వాన్” కథాంశం.

నటీనటుల పనితీరు: సుదీప్ ఈ సినిమా కోసం తన 100% ఎఫర్ట్స్ పెట్టాడు. ఒక పర్ఫెక్ట్ పహిల్వాన్ & బాక్సర్ షేప్ & బాడీ లాంగ్వేజ్ ను సాధించి ప్రేక్షకుల్ని తన పాత్రలో లీనమయ్యేలా చేసాడు. పతాక సన్నివేశాల్లో సుదీప్ నటన సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. అలాగే.. సుదీప్-సునీల్ శెట్టి కాంబినేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. సునీల్ శెట్టి సౌత్ డెబ్యూలో మంచి పాత్రతో ఆకట్టుకున్నాడు. ఆయన క్యారెక్టర్ & క్యారెక్టరైజేషన్ కు సినిమాలో మంచి వెయిట్ ఉంది.

ఆకాంక్ష సింగ్ కు సినిమాలో నటించడానికి మంచి స్కోప్ ఉండడంతోపాటు.. కథలో ఆమె పాత్రకు ప్రాముఖ్యత కూడా ఉంది. ఆమె అందంగా కనిపించింది కూడా. కానీ.. ఆమెకు రాసిన సన్నివేశాలు, సుదీప్ తో కెమిస్ట్రీ మాత్రం ఆకట్టుకొనే విధంగా లేదు. దాంతో సినిమాకి ఈ లవ్ ట్రాక్ మైనస్ గా మారింది.

కబీర్ దుహాన్ సింగ్ తన పాత్రకు న్యాయం చేసాడు. ఇక మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పర్వాలేదనిపించుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు: అర్జున్ జన్య సంగీతం సోసోగా ఉన్నా.. నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. ఎలివేషన్స్ సీన్స్ & యాక్షన్ బ్లాక్స్ కి అతడు సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. కానీ.. సదరు యాక్షన్ బ్లాక్స్ ఇంటెన్సిటీకి మించి సాగడంతో బోర్ కొడుతుంది. కరుణాకర సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సినిమా లవర్స్ కి బాగా నచ్చుతుంది. ప్రొడక్షన్ వేల్యూస్ అన్నీ బాగున్నాయి.

దర్శకుడు ఎస్.కృష్ణ రాసుకున్న కథ బాలీవుడ్ చిత్రాలైన “సుల్తాన్”ను పదే పదే గుర్తు చేస్తోంది. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా యావరేజ్ గా ఉంది. అన్నిటికీ మించి ఒక ఎంగేజింగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది సినిమాలో మిస్సయ్యింది. అందువల్ల నటీనటుల పనితీరు బాగున్నప్పటికీ.. కేవలం కథనంలో వేగం, కథలో ఇంటెన్సిటీ లేనందువల్ల సినిమా అక్కడక్కా ఆకట్టుకొంటూ.. చాలా వరకూ బోర్ కొడుతుంది.

విశ్లేషణ: కథ-కథనంతో సంబంధం లేకుండా మాస్ ఎలిమెంట్స్ & యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ హ్యాపీగా ఒకసారి చూడదగ్గ సినిమా “పహిల్వాన్”.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus