Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు
- February 5, 2026 / 03:10 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్‌లో ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ మరో వివాదానికి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ వేదికగా మొదలైన అంశం, ఇప్పుడు పోలీస్ కేసు వరకు వెళ్లడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు, యువ హీరో చంద్రహాస్ ఈ వివాదంలో కేంద్రబిందువుగా నిలిచారు.
Chandrahas
‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా చంద్రహాస్ వేదికపై పాడిన పాటలో అభ్యంతరకర పదాలు ఉండటంతో, అక్కడే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటకు సంబంధించిన వీడియోపై ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు ఘాటుగా స్పందించటంతో విషయం మరింత ముదిరింది. ఆ జర్నలిస్ట్ ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీడియో పోస్ట్ చేయగా, దానికి ప్రతిస్పందనగా చంద్రహాస్ మరో వీడియో విడుదల చేసి తనకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నారు.

అయితే ఆ వీడియోలో తనను బెదిరించినట్టుగా ఉందని, తనకు ప్రాణహాని ఉందన్న ఆందోళనతో సదరు జర్నలిస్ట్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రహాస్‌పై కేసు నమోదు అయినట్టు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సినీ అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీస్తోంది.
కొంతమంది యువ హీరోలపై బాధ్యత ఉండాలంటూ విమర్శిస్తుంటే, మరికొందరు ఇది అతిగా తీసుకున్న వ్యవహారమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమం ఇలా వివాదంగా మారడం టాలీవుడ్‌లో మరోసారి సంచలనంగా మారింది. ఇక ఈ కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, చంద్రహాస్ దీనికి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.













