Pottel Review in Telugu: పొట్టేల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 24, 2024 / 11:48 AM IST

Cast & Crew

  • యువ చంద్ర (Hero)
  • అనన్య నాగళ్ల (Heroine)
  • అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ (Cast)
  • సాహిత్ మోత్కూరి (Director)
  • నిశాంక్ రెడ్డి కుడితి - సురేష్ కుమార్ సాదిగ (Producer)
  • శేఖర్ చంద్ర (Music)
  • మోనిష్ భూపతిరాజు (Cinematography)
  • Release Date : అక్టోబర్ 25, 2024

ఈమధ్యకాలంలో ఓ చిన్న సినిమాకి భీభత్సమైన బజ్ రావడం అనేది బహుశా “పొట్టేల్” (Pottel) విషయంలోనే జరిగింది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ కానీ, ప్రెస్ మీట్ లో జరిగిన హడావుడి వల్ల కానీ సినిమా అందరికీ రీచ్ అయ్యింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదలకానుండగా.. రెండ్రోజుల ముందే ప్రీమియర్స్ నిర్వహించారు దర్శకనిర్మాతలు. మరి “పొట్టేల్” చిత్రం వారి నమ్మకాన్ని నిలబెట్టిందో లేదో చూద్దాం..!!

Pottel Review

కథ: తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు, పటేల్ వ్యవస్థను ప్రభుత్వం నిలువరించడానికి ముందు తెలంగాణ ప్రాంతంలోని గుర్రంగట్టు అనే ఓ మారుమూల గ్రామంలో జరిగిన కథ ఈ “పొట్టేల్”.

బాలమ్మ పొట్టేల్ కు కాపరైన గంగాధర్ (యువ చంద్ర) ఊరికి పెద్ద అయిన పటేల్ (అజయ్) (Ajay) ఆగడాలను అడ్డుకోవాలనుకుంటాడు. అయితే.. ఊరంతా పటేల్ వ్యవస్థను గుడ్డిగా నమ్మడంతో గంగ మాటలు ఎవరు పట్టించుకోరు.

పటేల్ వ్యవస్థ నుండి బయటకు రమ్మని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపునిచ్చిన తర్వాత కూడా పటేల్ గుర్రంగట్టు ప్రజలందరిపై మూఢ నమ్మకం ఛాయలో అధికారం చలాయిస్తూనే ఉంటాడు.

తాను చదువుకోలేకపోయాడు కాబట్టి.. కనీసం తన కూతురు సరస్వతినైనా చదివించాలని దృఢంగా నిశ్చయించుకుంటాడు గంగ. ఆ సంకల్పానికి ఎదురైన సమస్యలు ఏమిటి? గంగ ఆశలు పటేల్ ఎలా తొక్కిపెట్టాడు? గుర్రంగట్టు ప్రజలు పటేల్ ఆడుతున్న ఆట నుండి ఎలా బయటపడ్డారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పొట్టేల్” చిత్రం.

నటీనటుల పనితీరు: ఒక మంచి నటుడికి ఆసక్తికరమైన పాత్ర ఇస్తే ఏస్థాయిలో జీవిస్తాడు అనేందుకు “పొట్టేల్” (Pottel) చిత్రంలోని పటేల్ పాత్రలో అజయ్ ఒదిగిపోయిన విధానం ఉదాహరణగా నిలుస్తుంది. “తని ఒరువన్”లో అరవింద స్వామి, “మాస్టర్”లో విజయ్ సేతుపతిల తర్వాత ఆ స్థాయిలో అద్భుతంగా రాయబడిన విలన్ క్యారెక్టర్ “పొట్టేల్” సినిమాలో పటేల్. పాత్ర పుట్టుక ఏమిటి, ఆ పాత్ర అలా వ్యవహరించడానికి కారణం ఏమిటి? వంటి విషయాలు ఎంతో నేర్పుతో రాసుకున్న విధానం, దాన్ని అజయ్ తెరపై పండించిన తీరు అద్భుతం. అజయ్ లాంటి నటుడ్ని మన దర్శకులు సరిగా వినియోగించుకోకుండా పరభాషా నటులను అనవసరంగా పోషిస్తున్నారు. ఇప్పటికే “మత్తు వదలరా 2, దేవర” సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న అజయ్ కి “పొట్టేల్” ఎన్నాళ్ల నుండో రాకుండా ఉండిపోయిన గుర్తింపును తీసుకొచ్చింది.

యువ చంద్ర నటనలో నిజాయితీ కనిపిస్తుంది. పాత్ర కోసం తనను తాను తీర్చిదిద్దుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా కూతురు చదువు కోసం దేనికైనా తెగించే తండ్రిగా అతడి నటన చాలా సహజంగా ఉంది.

అనన్య నాగళ్ల (Ananya Nagalla) మరోసారి సహజమైన పాత్రలో చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆమె కట్టు బొట్టు, ఆ ముఖంలోని అమాయకత్వం బుజ్జమ్మ పాత్రకు ప్లస్ అయ్యాయి.

ఉపాధ్యాయుడి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్, మరో సపోర్టింగ్ రోల్లో నోయల్ చక్కని నటనతో ఆకట్టుకున్నారు. సరస్వతిగా నటించిన పాప తన్వి శ్రీ పెద్ద కళ్లతో భయాన్ని, బాధని పండించిన తీరు ప్రశంసనీయం.

సాంకేతికవర్గం పనితీరు: శేఖర్ చంద్ర పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. పాటలన్నీ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కేస్తాయి. ఇక నేపథ్య సంగీతమైతే.. సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ లో రీ-రికార్డింగ్ & వోకల్స్ తారా స్థాయిలో ఉన్నాయి. శేఖర్ చంద్ర కెరీర్ కి ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుంది.

మోనిష్ భూపతిరాజు సినిమాటోగ్రఫీ వర్క్ కూడా ఈ సినిమాకి కీలకాంశం. ప్రీక్లైమాక్స్ లో హీరోకి సరిగా కన్నుపడని సీక్వెన్స్ ను బాడీ క్యామ్ ఫార్మాట్ లో తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తుంది. అలాగే.. సన్నివేశంలోని ఎమోషన్ కు తగ్గట్లుగా వినియోగించిన కలరింగ్ & ఫ్రేమింగ్ ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా చేశాయి.

ప్రొడక్షన్ డిజైనింగ్ టీమ్ వర్క్ సినిమాలో జీవకళ ఉట్టిపడేలా చేసింది. ఎందుకంటే.. 1950 నుండి1990 నడుమ జరిగే ఈ కథలో ఎక్కడా అసహజత్వం అనేది. కనబడనీయకుండా వాళ్లు తీసుకున్న జాగ్రత్తలు ప్రశంసార్హం అదే విధంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వేసిన చిన్నపాటి సెట్స్, మరీ ముఖ్యంగా బాలమ్మ గుడి ప్రాంగణం లైవ్లీగా ఉంది.

నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. దర్శకుడి విజన్ కు ఎంతలా సపోర్ట్ చేశారు అనేది సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఓ దర్శకుడికి రెండో సినిమాకే ఇలాంటి నిర్మాతలు దొరకడం అనేది అదృష్టం అనే చెప్పాలి.

ఇక దర్శకుడు సాహిత్ మోత్కూరి గురించి మాట్లాడుకోవాలి. “సవారి” (2020)తో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కూరి మొదటి సినిమాతో అలరించలేకపోయాడు. ఆ పరాభవం తాలూకు కసి “పొట్టేల్” సినిమా రేటింగ్ లో కనిపిస్తుంది. సినిమా బ్యాక్ డ్రాప్, పాత్రల తీరుతెన్నులు, క్యారెక్టర్ ఆర్క్స్ రాసుకున్న విధానం చాలా బాగుంది. ముఖ్యంగా స్టోరీ బ్యాక్ డ్రాప్ మరియు పక్షి కథను యానిమేటెడ్ వెర్షన్ లో ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఒక రచయితగా సాహిత్ పనితనంలో వంక పెట్టడానికి ఏమీ లేదు. అయితే.. ఆ రాసుకున్న సన్నివేశాలను కంపోజ్ చేసిన తీరులో మాత్రం షార్ప్ నెస్ మిస్ అయ్యింది. నిజానికి సినిమాలో షాక్ వేల్యూ ఉన్న సన్నివేశాలు చాలానే ఉన్నాయి.

అయితే.. సదరు సన్నివేశాలు ఊహించనివే అయినప్పటికీ, ఇంపాక్ట్ మిస్ అయ్యింది. అందుకు కారణం స్క్రీన్ ప్లే & సీన్ కంపోజిషన్ లో కొరవడిన కమాండ్. ఆ రెండు విషయాల్లో కాస్తంత జాగ్రత్తపడి ఉంటే ఈ సినిమాకి “కాంతార” స్థాయి గుర్తింపు వచ్చి ఉండేది. ముఖ్యంగా ఓ స్వార్థపరుడు దైవాన్ని, మూఢ నమ్మకాల్ని తనకు కావాల్సినట్లుగా వాడుకొని ప్రజలను ఎలా గొర్రెల మందలా మార్చి తన చుట్టూ తిప్పుకున్నాడు అనే అంశాన్ని రాసుకున్న విధానం ఆశ్చర్యపరుస్తుంది. ఓవరాల్ గా సాహిత్ దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు అని చెప్పాలి.

విశ్లేషణ: బలమైన పాత్రలు, నిజ జీవిత ఆధారిత కథాంశంతో సమాజంలోని ఓ సమస్యను వేలెత్తిచూపడం అనేది మెచ్చుకోవాల్సిన అంశం. సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే పరిమితం అయిపోతున్న ఈ తరుణంలో “పొట్టేల్” లాంటి సినిమా తీయడం ప్రశంసనీయం. ముఖ్యంగా అప్పటికీ, ఇప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల మెదళ్లలో పాతుకుపోయిన కులాహంకారం అనే అంశాన్ని ప్రాజెక్ట్ చేసిన విధానం “పొట్టేల్”కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చదువు అనేది ఒక మనిషిని కాదు సమాజాన్ని, వ్యవస్థను తీర్చిదిద్దుతుంది అనే గొప్ప విషయాన్ని “పొట్టేల్” సినిమా ద్వారా తెలియజెప్పడం అనేది అభినందనీయం.

శేఖర్ చంద్ర సంగీతం, మోనిష్ భూపతిరాజు సినిమాటోగ్రఫీ వర్క్, అజయ్ నటవిశ్వరూపం, సాహిత్ మోత్కూరి రైటింగ్ కలగలిసి “పొట్టేల్”ను తప్పకుండా చూడాల్సిన సినిమాగా తీర్చిదిద్దాయి.

ఫోకస్ పాయింట్: పోరాట పటిమకు సంకల్ప బలం తోడైతే ఎలా ఉంటుందో చూపించిన “పొట్టేల్”.

Pottel Movie Rating: 3/5

Click Here to Read In ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus