ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి, ఆఖరికి రెండు సినిమాలను ప్రకటించడానికి ఇబ్బంది పడుతున్న హీరోలు ఉన్న టాలీవుడ్ ఇది. అయితే కరోనా – లాక్డౌన్ వల్ల వచ్చిన గ్యాప్ కారణంగా కొంతమంది హీరోలు వరుస సినిమాలు ప్రకటించేస్తున్నారు. ఒక సినిమా ఆఖరులో ఉన్నప్పుడే వేరే సినిమా మొదలుపెట్టేస్తున్నారు. అలాంటివారిలో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ కొత్త సినిమాల వరుస ఎలా ఉందంటే… ఏ రోజు ఏ అప్డేట్ వస్తుంది. అసలు ఏ అప్డేట్ ఏ సినిమాది అనేది అర్థకానంతగా చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. ‘రాధే శ్యామ్’ పనులు ఆఖరికి (?) వచ్చేశాయి. ‘ఆదిపురుష్’, ‘సలార్’ షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇవి కాకుండా నాగ్ అశ్విన్ సినిమా ప్రకటన చాలా రోజుల క్రితమే అయిపోయింది. దీంతో అభిమానుల్లోనూ చిన్న కన్ఫ్యూజన్ మొదలైంది. ఏ సినిమా అప్డేట్ ఏది అంటూ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈలోగా ‘సలార్’ విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై చిత్రదర్శకుడు ఎంత క్లారిటీ ఇస్తున్నా అవి ఆగడం లేదు. మా సినిమా ‘ఉగ్రమ్’కి రీమేక్ కాదని డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నాడు.
‘సలార్’ విషయంలో ఇటీవల ప్రశాంత్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. దాంతోపాటు మరో విషయం కూడా చెప్పాడు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పాడట. సంక్రాంతి అంటే పది నెలల సమయం ఉంది. కాబట్టి అప్పటికి సినిమా రెడీ అవ్వొచ్చని వినిపిస్తోంది. అయితే ఇన్ని సినిమాల మధ్యలో ప్రభాస్ అన్ని డేట్స్ ఇస్తాడా? ఇచ్చి పూర్తి చేయగలడా అనేది ఓ డౌట్. మరోవైపు సినిమాకు పది నెలలా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒక్కో సినిమా పూర్తి చేసుకొని వేగంగా రిలీజ్ చేస్తే బెటర్ కదా అనే మాటలూ వినిపిస్తున్నాయి. ప్రభాస్ గారూ మీకూ వినిపించే ఉంటాయి.