‘కేజీయఫ్’ సినిమాలు చూసేవారికి అందులో హీరో యశ్ లుక్, పాత్ర ఎంతగా నచ్చుతుందో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన కన్‌ఫ్యూజన్ అంతగా చిరాకు పెట్టిస్తుంది. మీరు ఆ సినిమాలు చూసి ఉంటే ఆ సమస్య మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. ఒకవేళ పొరపాటున ఆ సినిమాలు చూడకుండా చూసిన వారిని ఒకసారి అడగండి. సినిమాలో ప్రధాన పాత్రలు చాలానే ఉంటాయి. వారి పేర్లు డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే సినిమా అయ్యాక ఎవరు, ఏంటి అనే కన్‌ఫ్యూజన్ చాలామందికి వస్తుంది. దీనిపై యశ్ ఫ్యాన్స్ కూడా బహిరంగంగానే విమర్శలు చేసి ఉన్నారు.
ఆ తర్వాత ‘సలార్’ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది కాస్త వచ్చింది. అయితే పాత్రల సంఖ్య ‘కేజీయఫ్’ సినిమాల అంత ఎక్కువగా ఉండవు. కానీ మనకు దగ్గరగా ఉండని పేర్లు కాబట్టి ఆ ఇబ్బంది కాస్త కనిపించింది. ఈ విషయాలన్నీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గరకు వెళ్లినట్లు ఉన్నాయి. ఎందుకంటే ‘డ్రాగన్’ ప్రచారం షురూ చేసినప్పుడే సినిమాలోని ప్రధాన పాత్రల పేర్లు, వారి పనుల గురించి కూడా చెప్పేశారు. సినిమా నేపథ్యం చెప్పే సమయంలో పాత్రల పేర్లు, వారి పని క్లియర్‌గా చెప్పేశారు.
అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ విలన్లను పరిచయం చేస్తున్నాం అంటూ పాత్రల పేర్లను అనౌన్స్ చేశారు. ఆఖరిగా ఎన్టీఆర్ పేరు లూగర్ అని, అతను ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అసాసిన్ చీఫ్ అని చెప్పేశారు. ఈ క్రమంలో దాదా సర్కార్ (అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్), సుజోయ్ సర్కార్ (ఏటీసీ సెకండన్ ఇన్ కమాండ్), బాబీ సర్కార్ (ఏటీసీ వాజిర్), రావ్ (ఏటీసీ అకౌంటెంట్), విక్టర్ మెనెస్కో (రష్యా డిస్ట్రిబ్యూటర్), జనరల్ దురాన్ (సోమాలియా లార్డ్), బైల్, క్సెర్సీ (ఆఫ్రికా, యూరప్ డిస్ట్రిబ్యూటర్), జలీల్ రెహ్మాన్ (అఫ్గానిస్థాన్ లాజిస్టిక్స్ హెడ్), ట్రైనర్ అండ్ ట్రైనీస్ అంటూ సినిమా ప్రధాన పాత్రలను ప్రకటించేశారు.
అన్నట్లు హీరో అంటూ నార్కోటిక్ బ్యూరో ఇండియా చీఫ్ రఘువీర్ రాథోడ్ (అనిల్ కపూర్)ని కూడా చూపించారు. అంటే సినిమా విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఈ పేర్లకు ప్రేక్షకులు అలవాటుపడతారు అనే ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి ప్రశాంత్ నీల్ ఆలోచనేంటో చూడాలి.