బయోపిక్ అంటే ఇదివరకు భయపడేవారు. ప్రసంశలు తప్ప.. కాసులు కురవడం కష్టమని భావించేవారు. భారీ బడ్జెట్ తీస్తే అంతేసంగతులని బెదిరించేవారు. ఈ అపోహలన్నిటినీ మహానటి తుడిచేసింది. సావిత్రి జీవితంపై తీసిన ఈ మూవీ లాభాలను పంచిపెట్టింది. సినీ తారల బయోపిక్ లకే కాదు.. క్రీడాకారుల బయోపిక్ లకు కూడా భారీగా బిజినెస్ జరుగుతుందని ధోని బయోపిక్ మూవీ నిరూపించింది. సో ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ పై ఓ బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మిథాలీ రాజ్ గా కంగనా రనౌత్ లేదా ప్రియాంక చోప్రా నటిస్తారనే వార్తలు విహారం చేస్తున్నాయి. అధికారికంగా ఎవరి పేరుని చిత్ర బృందం ఇప్పటివరకు ప్రకటించలేదు.
దర్శకనిర్మాతల అభిప్రాయాన్ని కాసేపు పక్కన పెట్టి.. మిథాలీ రాజ్ కి ఎవరు తనలాగా చేయగలరని అడిగేస్తే.. ఆమె మనసులో ఎవరు ఉన్నారో తెలిసిపోతోంది. అందుకే రీసెంట్ గా మిథాలీరాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆమె ముందు ఈ ప్రశ్నని ఉంచారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. “నా కెరీర్ ఆధారంగా తీయబోతున్న ఈ బయోపిక్ లో నా పాత్రను ప్రియాంక చోప్రా చేస్తే బాగుంటుంది. ఆమె అయితే చక్కగా నటించగలదు. అంతేకాదు మా ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒకేలా ఉంటాయి” అని వెల్లడించింది. అయితే సినీ రంగంపై తనకు అంతగా అవగాహన లేదని, అందుకే నటుల ఎంపిక నిర్ణయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ఇష్టానికే వదిలేస్తున్నానని మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. మరి లక్కీఛాన్స్ ఎవరి తలుపుతడుతుందో చూడాలి.