టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరని చెప్పాలి. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఖర్చుపెట్టే ప్రతీ రూపాయిని కరెక్ట్ గా వినియోగించుకోవాలని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఆయన మరో కొత్త వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ఆడియో రంగంలో ఆదిత్య మ్యూజిక్ కు ఇప్పటివరకు తిరుగులేదు. బయటవాళ్ల నుండి పోటీ ఉన్నా.. ఈ రంగంలో ఆదిత్యదే పైచేయి. యూట్యూబ్ హక్కులు తీసుకుంటూ.. దానిపై ఆదాయం సంపాదించడంలో ఆదిత్య అందరికంటే ముందుంటుంది.
ఇప్పుడు ఆదిత్యకు పోటీగా సురేష్ బాబు బిజినెస్ మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఎస్పీ మ్యూజిక్ అనే లేబుల్ ను ఆయన ప్రారంభిచబోతున్నారని సమాచారం. ఎస్పీ అంటే సురేష్ ప్రొడక్షన్స్ కు షార్ట్ కట్ అన్నమాట. ఈ లేబుల్ మీద ఆడియో, వీడియో హక్కులు తీసుకొని విడుదల చేసుకుంటారు. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఎఫ్ఎంలు, అలానే పలు మ్యూజిక్ యాప్ లు, యూట్యూబ్ ఇలా చాలా డిజిటల్ మాధ్యమాల ద్వారా మంచి ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది.
పెద్ద హీరోల ఆడియో, వీడియో హక్కులంటే రెండు, మూడు కోట్ల వరకు పలుకుతున్నాయి. అందుకే ఈ బిజినెస్ లోకి సురేష్ బాబు ఎంటర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.