26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

మోహన్ బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన ‘పెదరాయుడు’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ పై హీరో మోహన్ బాబే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం కనపరిచారు. పెదరాయుడు గా అలాగే అతని పెద తమ్ముడు రాజా పాత్రల్లో నటించి మెప్పించారు. మోహన్ బాబు సరసన భానుప్రియ, సౌందర్య లు.. హీరోయిన్లుగా నటించారు.కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రంలో అతిథి పాత్రను పోషించడం మరో విశేషం. 1995వ సంవత్సరం జూన్ 15 న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 26 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘పెదరాయుడు’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి :

1) మోహన్ బాబు వరుస ప్లాపుల్లో ఉన్న రోజులవి. అతను నటించి నిర్మించిన సినిమాలు అన్నీ ప్లాప్ అవడంతో అతను భారీ నష్టాల్లో కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన రజినీకాంత్ ను కలవడం జరిగింది. మోహన్ బాబు తన పరిస్థితిని అంతా వివరించారు.అయితే కొద్ది రోజులకు మోహన్ బాబుకి రజినీ ఫోన్ చేసారు.అర్జెంట్ ఓ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేయమని మోహన్ బాబుతో చెప్పారట.

2) ఆ టైములో తమిళంలో ‘నాట్టమై’ అనే చిత్రం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అక్కడ సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది. ఆ చిత్రాన్ని చూసిన రజినీకి అది బాగా నచ్చేసింది. దాంతో మోహన్ బాబుతో ‘నాట్టమై’ అనువాద హక్కులను కొనుగోలు చేసేలా చేసారు. అంతేకాదు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఊరి పెద్ద పాత్రను నేను చేస్తాను అని మాట కూడా ఇచ్చారు.

3) రజినీ మాట ప్రకారం.. వెంటనే ‘నాట్టమై’ హక్కులను కొనుగోలు చేసి.. దర్శకుడి కోసం అన్వేషిస్తూ వచ్చారు. కొంతమందిని పరిశీలించిన తర్వాత రీమేక్ లకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రవిరాజా పినిశెట్టిని ఫైనల్ చేసారు.

4)మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తండ్రి ‘పెదరాయుడు’ చిత్రానికి రైటర్ గా పనిచేసారు. ఒరిజినల్ ను యాజ్ ఇట్ ఈజ్ గా దింపేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు మార్పులు చేశారు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం ఆయన రాసిన డైలాగ్స్ అద్భుతం అనే చెప్పాలి.

5) తమిళంలో పాపారాయుడు పాత్రని విజయ్ కుమార్ పోషించారు. దానికి పెద్దగా బిల్డప్ ఉండదు. కానీ తెలుగులో ఆ పాత్రని రజినీ పోషిస్తుండడంతో ఇక్కడ దానికి భిన్నంగా డిజైన్ చేశారు. ఈ పాత్రని దర్శకుడు రవిరాజా పినిశెట్టి తీర్చిదిద్దిన తీరుకి మెచ్చుకోకుండా ఉండలేము.

6) 1995వ సంవత్సరం జూన్ 15 న ఈ చిత్రం విడుదల కాబోతుంది అని అనౌన్స్ చేశారు. అయినప్పటికీ సినిమా పై ఎటువంటి అంచనాలు లేవు. ఎందుకంటే అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘బిగ్ బాస్’ చిత్రం విడుదలవుతుంది కనుక..!

7) ఎక్కువ శాతం స్క్రీన్లు ‘బిగ్ బాస్’ మూవీకే దక్కాయి. కానీ మార్నింగ్ షో పడిన వెంటనే ‘బిగ్ బాస్’ కు ప్లాప్ టాక్ రావడం.. ‘పెదరాయుడు’ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడం జరిగింది. ఈవెనింగ్ షోల నుండీ ‘పెదరాయుడు’ హవా మొదలైంది.ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే..!

8) రెండో వారం నుండీ ‘పెదరాయుడు’ వసూళ్లు అమాంతం పెరిగాయి. ఫైనల్ గా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 40 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. అప్పటివరకు టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా చిరంజీవి ‘ఘరానామొగుడు’ ఉంది. ఆ చిత్రం రూ.10 కోట్లను కొల్లగొట్టింది. అయితే ‘పెదరాయుడు’ చిత్రం దానిని అధిగమించి ఫుల్ రన్లో రూ.12కోట్ల వసూళ్ళను రాబట్టింది.

9) ఈ చిత్రంలో భార్య గొప్పతనాన్ని తెలుపుతూ.. ‘ది రిలేషన్ షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హజ్ బ్యాండ్ అనే డైలాగ్ ఉంటుంది. దీనికి అర్ధం తెలియనప్పటికీ మాస్ ప్రేక్షకులు ఈలలు వేశారు. ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజినీ ఎపిసోడ్ కు మాస్ థియేటర్లు దద్దరిల్లాయి. కేవలం ఈ పాత్ర కోసమే ‘పెదరాయుడు’ ని 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

10) ఇక మోహన్ బాబు తనకు ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాని నిర్మించాడు. అలాగే పెదరాయుడు పాత్రకు ఆయన జీవం పోసాడనే చెప్పాలి. అటు తర్వాత ‘పెద్దన్నయ్య’ లో బాలకృష్ణ, ‘సూర్యవంశం’ లో వెంకటేష్ లు ఆ టైపు పోషించినా.. అవి మోహన్ బాబుని మరిపించలేకపోయాయి అనే చెప్పాలి.

Share.