అపోహతో వచ్చి నిస్పృహలో కొత్త నిర్మాతలు!

సినిమా అనేది కలల ప్రపంచం. డబ్బు సంపాదన కోసం వచ్చేవారు కొందరు, పేరు తెచ్చుకొందామని వచ్చేవారు ఇంకొందరు. ఇవన్నీ కాక పరిచయాలు పెంచుకొని ఎదగాలని వచ్చేవారు కూడా ఉంటారు. అయితే.. ఎట్టకేలకు అందరిది ఒకే ధ్యేయం.. సెటిల్ అవ్వాలి. నటుడైనా, నిర్మాతైనా, కథానాయికైనా, క్యారెక్టర్ ఆర్టిస్టైనా, టెక్నీషియనైనా.. ఎవరైనా సరే సెటిల్ అవుదామనే ఇండస్ట్రీకి వస్తారు. వీరిలో నిర్మాత మినహా అందరూ ఏదో ఒకలా సెటిల్ అయిపోతున్నారు. కానీ.. ఒక్క నిర్మాత మాత్రమే నష్టపోతున్నాడు. సినిమా ఫ్లాపై నష్టపోతే పర్లేదు కానీ.. ఒక్కోసారి సినిమా బాగుంది అని టాక్ వచ్చిన తర్వాత ఆ సినిమాను థియేటర్లో ఆడించే దమ్ములేక ఓడిపోతున్న నిర్మాతల సంఖ్య ఎక్కువైంది. అందుకు కారణం ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లు తగ్గిపోవడమే. ఇదివరకూ ఒక ఏరియా నుండి కనీసం అయిదారుగురు డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు.

అప్పట్లో స్టోరీ సిట్టింగ్స్ లోనూ డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారట, కథ నచ్చితే అడ్వాన్స్ కూడా ఇచ్చేవారట. ఆ తర్వాత సగం సినిమా అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ కి అప్పటివరకూ తీసిన సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ కి చూపిస్తే వారు నచ్చితే అడ్వాన్స్ పే చేసేవారు. ఒక దశాబ్ధం ముందు సినిమా పూర్తయ్యి ఫస్ట్ కాపీ వచ్చాక డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఒక షో వేసేవారు. రానురానూ ఆ వ్యవస్థ మొత్తం మారిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ట్రైలర్ చూసి సినిమా కోనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాముఖ్యత తగ్గుతుండడంతో.. ఒకప్పుడు బడా డిస్ట్రిబ్యూటర్లుగా చలామణి అయినవాళ్ళందరూ ఇప్పుడు ఫైనాన్సియర్లుగా కొనసాగుతున్నారు. ఇక మిగిలిన కొద్ది మంది డిస్ట్రిబ్యూటర్లు స్టార్ హీరోల సినిమాల్ని మాత్రమే కొంటుండడంతో.. చిన్న సినిమాల్ని కొనేవారు కరువయ్యారు. దాంతో.. సదరు చిన్న చిత్రాల నిర్మాతలు తీసిన సినిమా ల్యాబుల్లో మగ్గిపోవడం ఇష్టం లేక సొంత డబ్బులతోనే రిలీజ్ చేస్తున్నారు. ఆ కారణంగా భారీస్థాయిలో నష్టాల్ని చవిచూడాల్సి వస్తుంది. ఇందుకు పరిష్కారం ఇప్పుడప్పుడే దొరికే అవకాశం లేదు. అందువల్ల.. ఇండస్ట్రీకి సినిమా తీద్దామని వచ్చే నిర్మాతలు కాస్త ముందుచూపుతో వ్యవహరించి సరైన కార్యాచరణను సినిమా మొదలెట్టడానికి ముందే నిర్ణయించుకొంటే మంచిది.

అలాగే.. డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థలోనూ మార్పు రావాల్సి ఉంది. నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ మధ్య ర్యాపో పెరగాలి, సినిమాలు షూటింగ్ లో ఉండగానే డిస్ట్రిబ్యూటర్స్ ను ఇన్వాల్వ్ చేయాలి, ఒకవేళ నష్టం వస్తే నిర్మాతలు కూడా కాస్త భరించి డిస్ట్రిబ్యూటర్ అనేవాడ్ని ఆడుకోవాలి. ఇవన్నీ జరగడం ఇంత ఈజీ కాదు, కానీ జరిగితే బాగుపడేది మన చిత్ర పరిశ్రమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus