Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్ కామన్‌సెన్స్ లేకుండా తొక్కేద్దామనుకున్నారు
- October 25, 2026 / 09:26 AM ISTByFilmy Focus Desk
సినిమా పరిశ్రమలో నైజాం, సీడెడ్, ఆంధ్రా అని మూడు పదాలు ఎక్కువగా విని ఉంటారు. ఒకప్పుడు థియేటర్ల రికార్డుల గురించి మాట్లాడినప్పుడు, సినిమా బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు.. ఇప్పుడు స్క్రీన్ల సంఖ్య గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాలు వినిపిస్తూ ఉంటాయి. వీటి గురించి చాలామందికి తెలుసు. అయితే ఇప్పుడు ఇందులో రెండు పదాల వినియోగంపై యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Rahul Sankrityan
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. ఈ సినిమా ఇటీవల విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటూ.. కొంతమంది ఈ సినిమాను తూర్పారపట్టగా.. మరికొందరు సినిమాలో చెప్పిన విషయం తీసుకొండి అంటూ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం అనంతపురంలో ‘రణబాలి రణభేరి’ పేరుతో ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఆ కార్యక్రమంలో రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా అనంతపురంలోనే. ఇక్కడి థియేటర్లలోనే ‘ఇంద్ర’, ‘నరసింహనాయుడు’ సినిమాలు చూశాను. కెమెరా భుజాన వేసుకుని రాప్తాడు రోడ్డులోనే మొదటి షార్ట్ ఫిల్మ్ తీశాను. సినిమా ఎలా తీయాలో, ఎలా తీయకూడదో ఇక్కడే నేర్చుకున్నాను. దర్శకుడిగా నా ప్రయాణం మొదలైన ఊరిలోనే.. ఈ రోజు నా సినిమా హౌస్‌ఫుల్ బోర్డులతో ప్రదర్శితమవుతోంది అంటూ ఆనందంగా మాట్లాడారు.
అలాగే సినిమాపై జరిగిన దుష్ప్రచారం గురించి కూడా మాట్లాడారు. చరిత్రలో మరుగున పడిపోయిన చీకటి కోణాన్ని తెలియజేస్తూ, కమర్షియల్ సినిమాగా స్టార్స్‌తో తీయడం దేశంలోనే బహుశా మొదటిసారి అని చెప్పారు.. అయితే ఇంత గొప్ప ప్రయత్నం చేసినప్పుడు కొందరు మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది ఈ సినిమాను తొక్కేయాలని చూశారు అని చెప్పారు.
అలాగే మరో పాయింట్‌ను కూడా ప్రస్తావించారు. అదే సినిమా బిజినెస్‌లో సీడెడ్, నైజాం పదాల వినియోగం. ఆ పదాలు బానిసత్వపు గుర్తులని.. కొలోనియల్, బూర్జువా వ్యవస్థల నుంచి వచ్చిన పదాలని చెప్పారు. దయచేసి ఇకపై సీడెడ్ బదులు రాయలసీమ అని, నైజాం బదులు తెలంగాణ అనే పిలవండి అంటూ సూచనలు ఇచ్చారు.
















