సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలి? అనే శిక్షణ తరగుతులు ఇవ్వడానికి ఓ స్టార్ హీరోయిన్ కావాలి అంటే తొలి స్థానంలో నిలిచే కథానాయిక సమంత అనే చెప్పొచ్చు. వ్యక్తిగత, వృత్తిగత విషయాలతోపాటు ఎవరి మీదనైనా కోపం చూపించడం లాంటివి అందులో బాగా చేస్తుంది. ఇప్పుడు ఎందుకు చేసిందో తెలియదు కానీ 2025 సంవత్సరాన్ని రీవైండ్ చేసింది. ఈ మేరకు కొన్ని ఆసక్తికర ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఆమె రెండో పెళ్లి ఫొటో ఒకటి ఆసక్తికరంగా కనిపించింది.
ప్రముఖ దర్శకనిర్మాత రాజ్ నిడిమోరును ఇటీవల సమంత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు నుండే ఇద్దరూ ప్రేమలో, బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రేమబంధాన్ని భూతశుద్ధి వివాహ సాంప్రదాయంలో పెళ్లిబంధంగా మార్చారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోల్లో ఒకటి ఈ 2025 రివైండ్‌లో ఉంది. ఓ కుర్చీలో కూర్చుని రాజ్ నిడిమోరు విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ పెడితే.. సమంత పెద్దగా నవ్వుతున్న ఫొటో అది.
2025 తనకెంతో గొప్ప సంవత్సరమని చెబుతూ సమంత.. తన జీవితంలో ఈ ఏడాదిలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చేతికి మెహందీతో ఆనందంగా నవ్వుతూ ఉన్న ఫొటోతో స్టార్ట్ చేసి.. You`re not lucky you are aligned అనే తన లైఫ్‌లైన్ చెబుతూ.. క్రిస్‌మస్ వేడుకల ఫొటోను కూడా షేర్ చేసింది. వాటితోపాటు తన పెంపుడు శునకాల ఫొటోలు కూడా ఆ మెమొరీస్‌లో ఉన్నాయి.
ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికొస్తే.. ‘శుభం’ సినిమాలో ఆమె పాత్ర ఫొటోను, ఆ సినిమా హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉన్న స్క్రీన్ షాట్‌ను, తన పికిల్ బాల్ జట్టును ఛీర్ చేసిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకుంది. పక్కనే రాజ్ నిడిమోరు కూడా ఉన్నాడు. వాటికి జిమ్ వీడియోలు, కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ సినిమా లుక్ లాంటివి అదనం.