సినిమా లీకులను ఎలా ఆపాలి అని ఓవైపు చిత్రబృందాలు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఓ సినిమా టీమ్ మాత్రం లీక్ అవుతాయని తెలిసినా ఓపెన్‌గా ప్రజల మధ్యలో షూటింగ్ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు లీకై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మామూలుగా అయితే సినిమా లీక్ వీడియో చిన్నది ఒకటి బయటకు వచ్చినా సినిమా టీమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. లీక్ అవ్వకుండా ఏర్పాట్లు చేసుకుంటుంది. కానీ ‘పెద్ది’ సినిమా టీమ్ మాత్రం అలా చేయడం లేదు.
రామ్‌చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమా ‘పెద్ది’. ఉత్తరాంధ్రలో ఓ మారుమూల కొండ ప్రాంతానికి చెందిన పెద్ది అనే ఓ ఆట కూలీ జీవితాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎక్కడో కొండల్లోని ఓ తండా నుండి ఢిల్లీకి ఆ పెద్ది ఎందుకు వెళ్లాడు, అక్కడేం చేశాడు, ఎవరి కోసం చేశాడు అనేదే సినిమా కథ అని చెప్పేయొచ్చు. ఈ మేరకు ఇప్పుడు లీకులు బాగా వచ్చాయి. ఇంకొన్ని గ్లింప్స్ చూసి అల్లేసుకున్న అంశాలు.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల క్రితం ఢిల్లీలోని ఓ మైదానంలో రాత్రిపూట షూటింగ్ నిర్వహించారు. అప్పుడు పెద్దగా లీకులు రాలేదు. అయితే ఇటీవల అక్కడే లోకల్ రైల్వే స్టేషన్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ దిగాలుగా స్టేషన్ మెట్లు ఎక్కుతున్న, దిగుతున్న దృశ్యాలు, రోడ్డు మీద నడుస్తున్న సీన్లు లీక్ అయిపోయాయి. సోషల్ మీడియాలో వరుసగా వచ్చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీమ్ సీరియస్‌గా ఏమీ స్టెప్స్ తీసుకోలేదు.
ఏమైందా అని చూస్తే.. ఆ సీన్స్ వల్ల పెద్దగా బయటకు వచ్చే అంశం ఏమీ లేదు.. లేకపోగా సినిమాకు మంచి ప్రచారం కూడా దక్కుతోంది. రామ్‌చరణ్ రగ్గ్‌డ్ లుక్ దేశవ్యాప్తంగా ప్రచారం అవుతుంది అని అనుకుంటోందని టాక్. ఇక ఈ సినిమా నుండి ఈ ఏడాది ఆఖరకు మంచి డ్యాన్స్ బీట్ ఉన్న పాటను కానీ జోష్‌ఫుల్ పోస్టర్‌ను కానీ రిలీజ్ చేస్తారని సమాచారం.