ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రమోషన్స్ తో కాస్త గట్టిగా సౌండ్ చేసిన సినిమా ‘రాజా ది రాజా’ (Raja The Raja). నాగ్ అశ్విన్, ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయినటువంటి వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని..ల ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి నిహారిక దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆమె సోదరుడు ఋత్విక్ ను హీరోగా పరిచయం చేస్తూ ఆమె ఈ చిత్రాన్ని నిర్మించగా.. తెలుగు రాష్ట్రాల్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇంతమంది పెద్ద వాళ్ళు ఇచ్చిన పుషింగ్ ఈ సినిమాకి ఎంతవరకు కలిసొచ్చిందో తెలుసుకుందాం రండి :
కథ: సత్యం (నరేష్) ఓ సీనియర్ డాక్టర్. ఇంట్లోనే చిన్న క్లినిక్‌ని రన్ చేస్తుంటాడు. అతని ఏకైక కుమారుడు రాజ్ కుమార్ అలియాస్ రాజా (ఋత్విక్). తనలా కాకుండా కొడుకుని పెద్ద డాక్టర్‌ని చేయాలని కలలు కంటూ ఉంటాడు సత్యం. కానీ రాజా డ్రీమ్ మాత్రం ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని, ఆ రంగంలో రాణించాలని.! తండ్రి సంతోషం కోసం ఇష్టం లేకపోయినా డాక్టర్ చదువుతాడు. కానీ మరోవైపు ఫ్యాషన్ రంగంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో అరవింద్ కృష్ణ (అవసరాల శ్రీనివాస్) కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు.
రాజా డిజైన్స్ అరవింద్‌కి బాగా నచ్చుతాయి. కానీ ఆ డిజైన్స్‌కి సెట్ అయ్యే అమ్మాయిని వెతకమని అతనికి ఓ టెస్ట్ పెడతాడు. ఎంతమంది అమ్మాయిలను ఆడిషన్ చేసినా రాజా సంతృప్తి చెందడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఆద్య (విశాఖ) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. తన డిజైన్స్‌కి కరెక్ట్ అమ్మాయి ఆద్యే అని ఫిక్స్ అవుతాడు రాజా. ఇందుకోసం ఆమెతో స్నేహం చేస్తాడు.కాంపిటీషన్ కోసం రెడీ అవుతున్న టైమ్‌లో రాజా తన తండ్రికి దొరికేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు ఆద్య ఎవరు? ఆమెకు మణిగడ్‌కి చెందిన రాజ్యానికి సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: ఋత్విక్ కి ఇది తొలి సినిమా. లుక్స్ పరంగా ఓకే, క్లాస్‌గా కనిపించాడు. కానీ, సెటిల్డ్‌గా పెర్ఫార్మ్ చేయాల్సిన చోట కాస్త ఓవర్ ది టాప్ అనిపిస్తాడు. ఫైట్ సీక్వెన్స్‌లలో ఇబ్బంది పడుతూ డల్‌గా కనిపించాడు. ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా అతని పెర్ఫార్మన్స్ ఉండదు. హీరోయిన్‌గా చేసిన విశాఖ సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తోనే లాగించేసింది. గ్లామర్ పరంగా కూడా ఆమె పెద్దగా ఆకట్టుకోలేదు.సీనియర్ నరేష్ ఎప్పటిలానే తన పాత్రలో హుందాగా నటించాడు. రాజశ్రీ నాయర్ తల్లి పాత్రకు ఓకే. భద్రం, పార్వతీశం కామెడీ పెద్దగా పేలలేదు. విష్ణు ఓయ్ ఒక రోజు మాత్రమే కాల్షీట్ ఇచ్చినట్టు ఉన్నాడు.. రెండు సీన్లకే అతని పాత్రను సైడ్ చేసేశారు. సాయి కుమార్ మణిగడ్ రాజుగా పవర్ ఫుల్ లుక్‌లో కనిపించినా.. పాత్రలో మాత్రం ఆ పవర్ లేదు. రోహిణి తదితర మిగతా నటీనటులు ఓకే ఓకే అన్నట్టు చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ సినిమాకి అనిల్ బోయిడపు దర్శకుడు. ఆయన కంటే ముందుగా ఇద్దరు దర్శకులు ఈ ప్రాజెక్టును టేకప్ చేసి, ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఎగ్జిట్ ఇచ్చేశారట. ప్రమోషన్స్‌లో మేకర్స్ ఈ విషయం చెప్పగానే.. కథలో, స్క్రీన్‌ప్లేలో చాలా డెప్త్ ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ, అలాంటి అద్భుతాలకు స్కోప్ లేని పాత చింతకాయ పచ్చడి లాంటి కథ ఇది.స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ కూడా అంతే పాతగా ఉన్నాయి. కామెడీ వర్కౌట్ కాలేదు, చాలా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌కే థియేటర్లలోని ఆడియన్స్ నిద్రపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సెకండాఫ్ చిరంజీవి ‘రాజా విక్రమార్క’ సినిమాని తలపిస్తుంది.
సెకండాఫ్‌లో వచ్చే సెట్లు, నటీనటులు.. ఆ చుట్టూ ఉండే సెటప్ అంతా చాలా ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తుంది. డీవోపీ వర్క్ కొన్ని సీన్లలో బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ భారీ రేంజ్‌లో లేకపోయినా.. వంక పెట్టే విధంగా అయితే లేవు. సినిమాకి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ మార్క్ కె. రాబిన్ మ్యూజిక్ అనే చెప్పాలి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఇక సినిమాలో డబ్బింగ్ లోపాలు కూడా స్పష్టంగా కనిపించాయి. నరేష్ వంటి నటీనటులు డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళకుండా.. ఇంట్లో కూర్చుని ఫోన్‌లో రికార్డ్ చేసి ఆ ఫైల్స్ టీమ్‌కి పంపించేశారేమో అనిపిస్తుంది.
విశ్లేషణ: సినిమా స్టార్టింగ్లో హీరో ఫ్రెండ్స్ లో ఒకరు.. ‘క్రింజ్ ను పట్టుకుని సూపర్ కాన్సెప్ట్ అంటాడెంట్రా వీడు’ అని అంటారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఆ డైలాగ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి.
ఫోకస్ పాయింట్: కష్టం ‘రాజా’
రేటింగ్: 1/5