‘బాహుబలి’ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అందుకే ఆ సినిమాకు అంత పెద్ద విజయం దక్కింది. ఇప్పటికీ రిపీట్ మోడ్‌లో జనాలు చూస్తున్నారు. అలాంటి సినిమాల్లో ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ కిలికిలి భాష. కాలకేయులు ఈ భాషలోనే మాట్లాడుతుంటారు. ఇదేదో శబ్దాల కూడిక కాదు.. పూర్తి స్థాయి భాష అని సినిమా ప్రచారంలో చిత్రబృందం చెప్పింది. ఆ మేరకు వివరాలు కూడా వెల్లడించింది. ఇప్పుడు ఇదే తరహా ప్రయత్నం మరోసారి రాజమౌళి చేస్తున్నారని సమాచారం.
అవును.. రాజమౌళి కొత్త సినిమా ‘వారణాసి’కి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. అదే ఈ సినిమా కోసం కూడా రాజమౌళి అండ్ కో. ఓ భాషను సిద్ధం చేస్తున్నారట. ఓ లింగ్విస్టిక్ ఎక్స్‌పర్ట్‌ను ప్రత్యేకంగా ఈ సినిమా కోసం నియమించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓ పురాతన లిపిని సిద్ధం చేస్తున్నారట. సినిమాలోని టైమ్ ట్రావెల్ ఎపిసోడ్‌లో భాగంగా పాత్రలు ఓ గుహలోకి ప్రవేశించినప్పుడు ఈ లిపి కనిపిస్తుందట. అక్కడి నుండి సినిమా ఆసక్తికర మలుపు తిరుగుతుందట.
గుహలోని గోడలు, రాతి నిర్మాణాలపై ఎవరికీ తెలియని రాతలు కనిపిస్తాయట. ఆ రాతలను అర్థం చేసుకోవడం, అందులో దాగి ఉన్న రహస్యాలను ఛేదించడం ఈ సినిమాలో చూడొచ్చట. దాని కోసం ఇప్పుడు లిపిని సిద్ధం చేస్తున్నారట. ఎవరికీ తెలియదు కాబట్టి ఏదో ఒకటి రాసేద్దాం అనే ఉద్దేశంలో జక్కన్ లేరట. అందుకే ఓ అర్థం ఉండేలా ప్రాచీన భాషను సిద్ధం చేయిస్తున్నారట. గతంలో కిలికిలి భాషను ప్రముఖ తమిళ రచయిత మదన్ కార్కి సిద్ధం చేశారు.
ఇప్పుడు ఈ వారణాసి లిపిని ఎవరు సిద్ధం చేస్తారో మరి. సినిమా ప్రచారంలో దీనికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమాను రిలీజ్ చేస్తారు. అయితే రాజమౌళి సినిమాల విడుదల తేదీలు దగ్గరకు వచ్చాక మారొచ్చు. కాబట్టి మార్చిలో క్లారిటీ రావొచ్చు.