సాధారణంగా ఏడు పదుల వయసులో హీరోలు ఏం చేస్తారు? హుందాగా ఉండే పాత్రలో, లేదా వయసుకి తగ్గ యాక్షన్ సినిమాల్లో నటిస్తారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ తో మాత్రం ఈ వయసులో ఒక ప్యూర్ లవ్ స్టోరీ తీయాలని ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ సుధా కొంగర. వినడానికి ఇది చాలా క్రేజీగా ఉన్నా, ఆమె చెప్పిన పాయింట్ ఇప్పుడు కోలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
శివకార్తికేయన్ తో ఆమె తెరకెక్కించిన ‘పరాశక్తి’ సినిమా 2026 సంక్రాంతికి రాబోతోంది. ఈ ప్రమోషన్స్ లోనే సుధా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి నోరు విప్పారు. తనకు రజినీ అంటే ప్రాణమని, 1985లో వచ్చిన క్లాసిక్ ‘ముత్తల్ మరియతై’ తరహాలో రజినీతో ఒక అందమైన ప్రేమకథను ప్లాన్ చేయాలని ఉందట. ఇప్పుడున్న ట్రెండ్ లో రజినీ అంటేనే గన్స్, బాంబులు, మాస్ ఎలివేషన్లు. అలాంటిది ఆయన్ని ఇలా సాఫ్ట్ గా చూపించాలనే ఆలోచనే పెద్ద సాహసం.
సుధా కొంగర ట్రాక్ రికార్డ్ చూస్తే ఆమె ఎంత సెన్సిబుల్ డైరెక్టరో అర్థమవుతుంది. సూర్యతో ‘ఆకాశమే నీ హద్దురా’, వెంకటేష్ తో ‘గురు’ సినిమాల్లో ఎమోషన్స్ ను ఆమె పండించిన తీరు అద్భుతం. కాబట్టి ఆమె టేకింగ్ మీద ఎవరికీ డౌట్ లేదు. కానీ ప్రస్తుతం రజినీ ‘జైలర్ 2’ లాంటి హై వోల్టేజ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టైమ్ లో ఆయన లవ్ స్టోరీకి ఓకే చెప్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కానీ ఒక్కటి మాత్రం నిజం. రొటీన్ మాస్ మసాలా చూసి బోర్ కొట్టిన ఆడియన్స్ కు, రజినీని ఇలా కొత్తగా చూపిస్తే కచ్చితంగా నచ్చుతుంది. ఆ వయసులో ఉండే పరిణితి, ఎమోషన్స్ ను సుధా గనక సరిగ్గా క్యాప్చర్ చేస్తే అది ఇండియన్ స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ అవుతుంది. మరి సూపర్ స్టార్ ఈ లేడీ డైరెక్టర్ క్రేజీ ఐడియాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాలి.