ఇద్దరు సీనియర్ అగ్ర హీరోలు.. అందులోనూ మిత్రుల సినిమాలు ఒకే సమయానికి విడుదల కావడం అరుదు. ఏదో సంక్రాంతి సమయంలో ఇలాంటివి చూస్తాం కానీ.. నార్మల్ ఫెస్టివల్ సీజన్‌లో తక్కువగా చూస్తాం. అలాంటి అరుదైన పరస్థితిని ఇప్పుడు చూడబోతున్నాం. ఒక హీరో టాలీవుడ్‌లో టాప్ అయితే.. మరో హీరో కోలీవుడ్‌లో టాప్. ఆయనకు తెలుగులోనూ మంచి ఆదరణే దక్కుతోంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి దసరా సందర్భంగా బాక్సాఫీసు దగ్గర తన సత్తా చూపింబోతున్నారు.
వారే అగ్ర కథానాయకులు రజనీకాంత్ – చిరంజీవి. మొన్న సంక్రాంతికి వచ్చి అదరగొట్టిన చిరు.. ఇప్పుడు దసరా బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రజనీకాంత్ తన బ్లాక్ బస్టర్ సినిమా ‘జైలర్’కి సీక్వెల్‌ను అదే సమయానికే తీసుకొస్తున్నారు. అయితే ఇద్దరిలో ముందుగా వచ్చేది తలైవానే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జైలర్ 2’ సినిమాను అక్టోబరు 15న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చాలా నెలలుగా రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమాను అక్టోబరు 16న తీసుకొస్తామని అనుకుంటున్నారట. అధికారికంగా చెప్పలేదు కానీ.. త్వరలో ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందట. ఈ క్రమంలోనే దీన్ని దసరా రిలీజ్ అని ప్రకటించేస్తారట. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను చిత్రబృందం రెడీ చేస్తోందట.
గతంలో అంటే ‘జైలర్’ సమయంలోనే ఈ ఇద్దరు స్టార్‌లు దగ్గర దగ్గరగానే వచ్చారు. ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న విడుదలవ్వగా.. సినిమా భారీ విజయం అందుకుంది. ఇక చిరంజీవి ‘భోళాశంకర్’ను ఆగస్టు 11న విడుదల చేశారు. ఆ సినిమా ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఇప్పుడు మరోసారి ఇద్దరు హీరోలు కలసి రావడం ఆసక్తి రేపుతోంది. అన్నట్లు అప్పుడు ‘భోళాశంకర్’కి, ఇప్పుడు ‘విశ్వంభర’కి ఏ మాత్రం పాజిటివ్ బజ్ లేకపోవడం గమనార్హం.