సూపర్ స్టార్ రజినీకాంత్ తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు. గతేడాది నవంబర్ 4న దీపావళి సందర్భంగా ‘పెద్దన్న’ సినిమాతో రజినీకాంత్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందు రజినీకాంత్ ఆరోగ్యం పాడైనప్పటికీ.. కష్టపడి సినిమాను పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉంది.
దీంతో రజినీకాంత్ తన తదుపరి సినిమా కోసం సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆయన 169 సినిమా ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో తెలుసా..? టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. గతేడాది ‘డాక్టర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నెల్సన్ ఇప్పుడు విజయ్ హీరోగా ‘బీస్ట్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల 4న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదలైన తరువాత రజినీకాంత్ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడట.
సన్ పిక్చర్స్ బ్యానర్లోనే సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయని అంటున్నాయి. నిజానికి రజినీకాంత్ 169 దర్శకుడిగా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ మంచి ఎంటర్టైనింగ్ సినిమా చేయాలని నెల్సన్ దిలీప్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రజినీకాంత్. ‘అన్నాత్తే’ సినిమా తరువాత రజినీకాంత్ పొలిటికల్ పార్టీ పెడతారని అందరూ అనుకున్నారు కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో పాలిటిక్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.