అక్క స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు వచ్చి హీరో అవుతా అన్నాడు.. తీరా ఇప్పుడు హీరో అవ్వాలనేం లేదు.. ఏ పాత్ర అయినా రెడీ అంటున్నాడు ఓ యువ నటుడు. అందులో తప్పేముంది సరైన విజయం దక్కక అలా అంటున్నాడేమో అనుకుందాం అంటారా. ఇక్కడ విషయం ఏంటంటే ఆ కుర్రాడి తొలి సినిమానే ఇంకా విడుదల కాలేదు. అప్పుడే ఎలాంటి పాత్రకైనా ఓకే అంటున్నాడు. స్టార్ హీరోయిన్ తమ్ముడు ఇలా అనడం విచిత్రమే. ఆ అక్క రకుల్ అయితే, ఆ తమ్ముడు అమన్.
అమన్ ప్రీత్ సింగ్ హీరోగా తెరక్కిన ‘తెర వెనుక’ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో అమన్ విలేకర్లతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే కెరీర్ గురించి మాట్లాడాడు. ‘‘హీరో పాత్రలే చేయాలని నేను అనుకోవడం లేదు. కథ కథనం బలంగా ఉండి, నా పాత్రకు ప్రాధాన్యముంటే ఏ పాత్రలో నటించడానికైనా సిద్ధమే’’ అని చెప్పాడు. చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. మంచి విలన్గా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చా అని చెప్పాడు అమన్. ఇప్పటివరకు అక్క పేరు ఎక్కడా వాడుకోలేదు. ‘రకుల్ సోదరుడు’ అనే నీడ తనకు వద్దు అనుకోవడమే కారణమట.
నిజానికి రెండేళ్ల క్రితమే ‘త్రిశంకు’ పేరుతో అమన్ ఓ సినిమా మొదలుపెట్టాడు. అయితే అది ఆగిపోయింది. ఆ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’ అనే సినిమా చేశాడు. అది ఇంకా విడుదల కాలేదు. మూడో సినిమా ఇప్పుడు తొలి సినిమాగా విడుదలవుతోంది. మరోవైపు తెలుగులో రెండు కొత్త కథలు ఓకే చేశాడు. మరి ఇన్ని సినిమాలు చేతిలో ఉండి విలన్గా చేయడానికి కూడా సిద్ధమే అని అమన్ ఎందుకంటున్నాడు అతనికే తెలియాలి. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాం.