Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!
- November 5, 2026 / 01:43 PM ISTByPhani Kumar
Cast & Crew
- రణబీర్ కపూర్ (Hero)
- సాయి పల్లవి (Heroine)
- యష్,కాజల్, వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన తదితరులు (Cast)
- నితేష్ తివారి (Director)
- నమిత మల్హోత్రా (Producer)
- హ్యాన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ (Music)
- పంకజ్ కుమార్, మహేష్ లిమాయె (Cinematography)
- హుజెఫ లోకండ్ వాలా (Editor)
- Release Date : 5th నవంబర్ 2026
- ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ & DNEG (Banner)
ఈ తరానికి ‘రామాయణం’ (Ramayana) ప్రాముఖ్యతను తెలియజేయడం చాలా ముఖ్యం. ఆ లక్ష్యంతోనే బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితేశ్ తివారీ ‘రామాయణ’ ప్రాజెక్టును 2 భాగాలుగా తెరకెక్కించడానికి ముందుకొచ్చారు. దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్‌లో రూపొందిస్తున్న ప్రాజెక్టు ఇది. మొదటి భాగాన్ని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రణ్‌బీర్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోతో పాటు, ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో రావణాసురుడి పాత్రలో నటించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దానికి తోడు టీజర్, ట్రైలర్స్ వంటి వాటిల్లో విజువల్ ఎఫెక్ట్స్ టాప్ నాచ్‌లో ఉన్నాయి. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా? తెలుసుకుందాం రండి:
Ramayana Movie Review

కథ: వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. దాదాపు కథంతా అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా కథ అసురులు, దేవతల మధ్య జరిగిన యుద్ధ ఘట్టంతో మొదలవుతుంది. శ్రీవిష్ణువు కృప వల్ల దేవేంద్రుడు మహాశక్తివంతుడు అవుతాడు. యుద్ధంలో అసురులపై దేవతలు విజయం సాధించడానికి కారణమవుతాడు. దీంతో అసుర జాతి మొత్తం దేవతల ఆధీనంలోకి వెళ్తుంది. అలాగే లంకానగరం బయట ఉన్న రసాతలం అనే ప్రదేశంలో అసురులు తలదాచుకుంటారు. ఈ అవమానంతో కుంగిపోయిన కైకసి (శోభన) తన కుమారుడైన దశాననుడిని/రావణాసురుడిని (యష్) రెచ్చగొడుతుంది. శ్రీవిష్ణువు దేవతల పక్షపాతి అని, అసుర జాతిని అంతమొందించడానికి ప్రతిసారీ ఏదో ఒక అవతారం ఎత్తుతాడని చెబుతుంది.
దీంతో రావణాసురుడు హిమాలయాలకు వెళ్లి కఠోర తపస్సు చేయగా.. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన వరంతో అమరత్వం పొందుతాడు. మరోవైపు దశరథుడి (అరుణ్ గోవిల్) ముగ్గురు భార్యలకు నలుగురు కుమారులు జన్మిస్తారు. అందులో ఒకరు శ్రీరాముడు(రణ్‌బీర్ కపూర్). దశరథుని మిగిలిన ముగ్గురు కుమారులతో పోలిస్తే.. ఇతని ఆలోచనా శైలి ఎందుకు అంత ఉన్నతంగా ఉంది? శివ ధనుస్సుని విరచి సీతాదేవిని(సాయి పల్లవి) పెళ్ళాడమని బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఎందుకు ఇతనికి సెలవిచ్చారు? అలాగే విశ్వామిత్రుల వారు శ్రీరామునికి ఇచ్చిన వరం ఏంటి? వనవాసం చేసినప్పుడు శ్రీరాముడికి ఆ వరం ఎలా కలిసొచ్చింది? అనేది మిగిలిన కథాంశం.

నటీనటులు: శ్రీరాముని పాత్రలో రణ్‌బీర్ కపూర్ బాగా సెట్ అయ్యాడు. ప్రతి సన్నివేశంలోనూ ఎంతో హానెస్ట్‌గా పెర్ఫార్మ్ చేశాడు. పరశురాముడి పాత్రలో కూడా అతని మేకోవర్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా అతని కష్టం కనిపించింది. సాయి పల్లవి సీత పాత్రలో ఎందుకో సెట్ అయినట్టు అనిపించదు. చూడటానికి ఆమె బాగానే ఉన్నా.. ఒక డివైన్ ఫీలింగ్ అయితే కలగదు. ఆమె వాయిస్ కూడా అంతగా సెట్ అవ్వలేదు. సాధారణంగా పౌరాణిక చిత్రాల్లో ఫీమేల్ ఆర్టిస్టులు చీరను మడికట్టుకుంటారు, కానీ ఈ సినిమాలో నార్మల్‌గా చీర కట్టుకుని కనిపించింది. ఇక రావణాసురుడి పాత్రలో యష్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకున్నాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.
కాకపోతే సినిమా స్టార్టింగ్‌లో అతని పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు కేజీఎఫ్‌నే తలపిస్తాయి. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో బాగానే చేసింది. కానీ కొన్ని సన్నివేశాల్లో ఆమె మొహాన బొట్టు లేకుండా కనిపించడం విడ్డూరంగా అనిపిస్తుంది. కాజల్ మండోదరి పాత్రలో చూడటానికి బాగుంది. కానీ ఈమెకు దర్శకుడు ఒక్క డైలాగ్ మాత్రమే రాశాడు. బహుశా సెకండ్ పార్ట్‌లో ఈమె పాత్రకు ఎక్కువ సన్నివేశాలు, డైలాగ్‌లు ఉంటాయేమో. వివేక్ ఒబెరాయ్ శూర్పణఖ భర్త విద్యుత్ జిహ్వ పాత్రలో కాసేపు కనిపించి మాయమయ్యాడు. లక్ష్మణుడి పాత్రలో రవి దూబె కూడా బాగా నటించాడు. విభీషణుడిగా హరీష్ ఉత్తమన్ ఎక్కువసేపు కనిపించలేదు. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక నిపుణుల పనితీరు: మైథలాజికల్ సినిమాలు తీసేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకుని తీయాలని ‘ఆదిపురుష్’ సినిమా అందరికీ గొప్ప గుణపాఠం నేర్పింది. ఆ సినిమాలో ‘రామాయణం’ని అవమానించే విధంగా చాలా సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో ఆ సినిమా ఎదుర్కొన్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఆ విధంగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. బహుశా అవన్నీ గమనించే అనుకుంటాను.. ‘రామాయణ’ చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్లోనే ‘3Dలో చూస్తే బాగుంటుంది’ అనే ఫీల్ కలిగించాయి. కాకపోతే దర్శకుడు నితీశ్ తివారీ ఫోకస్ అంతా ఎక్కువగా ఆ వీఎఫ్ఎక్స్ పైనే పెట్టారు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే.. ఈ సినిమాలో ‘రామాయణ’ కథ సగమే ఉంటుంది. సీతమ్మను రావణాసురుడు అపహరించడం, జటాయువు పోరాడి మరణించడం.. అక్కడితోనే సినిమాకి ఎండ్ కార్డ్ పడింది.
అయినప్పటికీ ప్రతి పాత్రకీ ఓ బ్యాక్ స్టోరీ పెట్టి, ప్రతి 5, 10 నిమిషాలకు ఒక యాక్షన్ ఎపిసోడ్ పెట్టేసి సాగదీశారు. సాధారణంగా మైథలాజికల్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఉండాలి. పాటలు వింటున్నప్పుడు ఒక డివైన్ ఫీలింగ్ కలగాలి. మంచి సంభాషణలు వస్తున్నప్పుడు కూడా..! ‘ఆదిపురుష్’ కథ, కథనాలు ఎంత వీక్ గా ఉన్నా మ్యూజిక్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఆ సినిమా ఫుల్ మార్క్స్ వేయించుకుంది. కానీ ‘రామాయణ’లో మాత్రం సంగీతమే మేజర్ మైనస్ పాయింట్ అయ్యింది. పాటలు విని పాడుకునే స్థాయిలో లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే టీవీ సీరియల్‌ని తలపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గానే ఉంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించింది.

విశ్లేషణ: రామాయణంలో చాలా గొప్ప అంశాలు ఉంటాయి. తండ్రి మాటకు కట్టుబడటం, పెద్దలను గౌరవించడం, భార్యకు, కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, సహనం, ఏకాగ్రత.. ఇలా చాలా విలువైన విషయాలు ఇందులో కనిపిస్తాయి. అవన్నీ ప్రాక్టికల్‌గా తెలుసుకోవడం ఈ తరానికి చాలా అవసరం. విపరీతమైన వయొలెన్స్ తో కూడిన సినిమాలతో విసిగిపోయిన జనాలకి ‘రామాయణం’ రిలీఫ్ ఇచ్చే సినిమా.

ఫోకస్ పాయింట్: సాగతీత ఉన్నా… విజువల్ ఫీస్ట్ ఇచ్చింది!
రేటింగ్: 2.5/5


















