శంకర్- చరణ్ కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘RC15’ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. చరణ్ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్లో ఇది 50వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే శంకర్ మరోవైపు కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు.
అనేక కారణాల వల్ల ఆగిపోయిన ‘భారతీయుడు 2’ చిత్రం మొత్తానికి తిరిగి ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. శంకర్ చిత్రం పూర్తయ్యాక రాంచరణ్.. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. ‘యూవీ క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది.కొన్ని నెలల క్రితం అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఆగిపోయింది అనే టాక్ వినిపిస్తోంది.
గౌతమ్ తిన్ననూరి ఇచ్చిన ఫైనల్ నెరేషన్ కు చరణ్ సంతృప్తి చెందలేదట. పైగా అతను ఇటీవల తీసిన ‘జెర్సీ’ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. చరణ్ సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉందట.పాన్ ఇండియా సినిమాలను గౌతమ్ హ్యాండిల్ చేయలేడు అని గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ తో తేల్చేశాడు.
అందుకే చరణ్.. గౌతమ్ తిన్ననూరి స్క్రిప్ట్ ను పక్కన పెట్టినట్లు వినికిడి. అలా అని ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో అతను సినిమా చేయను అని చెప్పడం లేదు. ఆ బ్యానర్లో సినిమా చేయడానికి అతను సముఖంగానే ఉన్నాడట. దీంతో యూవీ వారు ఇప్పుడు చరణ్ ఇమేజ్ కు తగ్గ సినిమాని తెరకెక్కించే దర్శకుల కోసం వేట మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మరి ఇంతకాలం వెయిట్ చేసిన గౌతమ్ సంగతేంటో..?