మామూలుగా పూజా హెగ్డేని చూస్తుంటేనే కుర్రకారు గుండె ‘జిల్’మంటుంది. అలాంటిది ఐటెమ్ గర్ల్ గా సెక్సీ డ్రెస్ తో చూస్తే కుర్రకారుకేమిటి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గుండెల్లో కూడా జిల్లుమన్నట్లుంది. అందుకే పూజా వెంబడి “జిల్ జిల్ రాణి” అంటూ పరుగులు తీస్తున్నాడు చరణ్ బాబు. ఇదంతా అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా రామకృష్ణ నేతృత్వంలో వేయబడిన స్పెషల్ సెట్ లో జరుగుతోంది. ఇక ఎందుకోసం జరుగుతోంది అని అడిగితే.. “రంగస్థలం” సినిమా కోసమని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.
సుకుమార్ దర్శకత్వంలో జానీ మాస్టర్ నేతృత్వంలో జరుగుతున్న ఐటెమ్ సాంగ్ షూట్ గురించే ఇప్పుడు ఫిలిమ్ నగర్ లో చర్చ అంతా. దేవిశ్రీప్రసాద్ పాటకి హీరోహీరోయిన్లు మాత్రమే కాదు సెట్ లోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో స్టెప్పులేస్తున్నారట. సినిమా సెకండాఫ్ లో వచ్చే ఈ పాటకి థియేటర్ లో జనాలు ఊగిపోవడం ఖాయమని, అలాగే “జిల్ జిల్ రాణి” పాట 2018లో బెస్ట్ ఐటెమ్ నెంబర్ గా నిలుస్తుందని చెప్పుకొంటున్నారు. రామ్ చరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రెజంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతుంది.