సరైన పాత్ర వస్తే చెడుగుడు ఆడుకుంటానని రానా దగ్గుబాటి బాహుబలి సమయంలో నిరూపించారు. భల్లాల దేవాగా దేశ సినీ అభిమానులను భయపెట్టారు. ఆ తర్వాత నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అదరగొట్టారు. దీంతో అతనికి ఛాలెంజింగ్ రోల్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో చంద్రబాబు నాయుడి పాత్ర వరించింది. తనకిష్టమైన నాయకుడిగా కనిపించడానికి రానా చాలా సంతోషించారు. అతనిలాగే చంద్రబాబు అభిమానులు కూడా ఆనందించేలా.. అతనిలా మారిపోయారు. అప్పటి బాబులాగా సన్నపడి, కటింగ్ చేసుకున్నారు. మీసాలు పెంచారు.
చంద్రబాబు మేనరిజం.. మాట్లాడే తీరు ఇవన్నీ కాపీ కొట్టేందుకు పాత వీడియోలు కూడా చూసారు. సెట్ లోకి వెళ్లి అచుగుద్దినట్టు యువ చంద్రబాబుని కెమెరా ముందు దింపేశారు. సెట్ లో రానాని చూసిన ప్రతి ఒక్కరూ ఇదే మాట అన్నారు. అతని తండ్రి సురేష్ బాబుకూడా సెట్ లో రానాని చూసి షాక్ అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు బయటికి వచ్చిన రానా లుక్ చూసిన ప్రతిఒక్కరూ అది నిజమేనని అంటున్నారు. అంతలా రానా మారిపోయారని అభినందిస్తున్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమాని క్రిష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.