బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన IFFI వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్లో చాముండి దేవతను దెయ్యంగా పేర్కొన్నట్టుగా, అలాగే ‘ఓ’ అనే శబ్దాన్ని వెటకారంగా పలకడంతో నెటిజెన్లను ముఖ్యంగా హిందువులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో హిందూ జనజాగృతి సమితి (HJS) నాయకులు, రణ్ వీర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పనాజీ పోలీస్ స్టేషన్‌లో మెమొరాండం సమర్పించారు. దేవతను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేయాలని కూడా కోరారు.
వివాదం వేడెక్కుతున్న తరుణంలో రణ్ వీర్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రాంలో క్షమాపణలు తెలిపారు. “కాంతారలో రిషబ్ చేసిన అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. అలాంటి సీన్‌ను చేయడానికి ఎంత శ్రమ పడాల్సి వస్తుందో ఒక నటుడిగా నాకు బాగా తెలుసు అని, ఏ సంస్కృతి, సంప్రదాయాన్ని నేను అవమానించను. ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నా” అని ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదం రణ్ వీర్ వ్యాఖ్యలపైనే కాదు, సెలెబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్‌లలో మాట్లాడే ప్రతి మాట ఎంత ప్రభావం చూపుతుందో మరోసారి చర్చకు తెరలేపింది. అయితే రణ్ వీర్ స్పందనతో పరిస్థితి కొంత శాంతించినప్పటికీ, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. సెలెబ్రెటీలు సెన్సిటివ్ టాపిక్స్ పై మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం బెటర్ అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.