దేశంలోని అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. వివిధ రంగాలలో గుర్తింపు పొందిన వారి బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాంటి బయోపిక్స్‌లో దిగ్గజ గాయని, దివంగత ఎం.ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ కూడా ఉంది. సంగీతానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మిగా సినిమాలో ఎవరు నటిస్తారు అంటూ గత కొన్ని ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో పేర చర్చలోకి వచ్చింది.
ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథని తెరకెక్కించేందుకు ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రముఖ కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌తో కలసి ఆ సినిమా చేస్తారని లేటెస్ట్ టాక్. ఈ సినిమాకు యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు అని సమాచారం. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి.
తొలుత ఈ పాత్ర కోసం కీర్తి సురేశ్ పేరు బలంగా వినిపించింది. ఆమె ‘మహానటి’ సినిమా చేసిన నేపథ్యంలో ఈ సినిమాకు కూడా నప్పుతారు అని అనుకున్నారంతా. ఆ తర్వాత కొన్ని రోజులకు సాయిపల్లవి పేరు వినిపించింది. ఆమె దాదాపు ఫిక్స్ అని భావించారు. కానీ ఇప్పుడు రుక్మిణీ వసంత్ పేరు తెరపైకొచ్చింది. సాయిపల్లవి, కీర్తి సురేశ్ బిజీగా ఉన్నారో, లేక మరో కారణమో తెలియదు కానీ రుక్మిణి అయితే బెటర్ అనుకున్నారనే టాక్ వస్తోంది.
ఇదిలా జరుగుతుండగా.. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు చర్చలోకి వచ్చింది. ఆమెనే రష్మిక మందన అలియాస్ రష్మిక దేవరకొండ. ఇప్పటికే రష్మికకు లుక్ టెస్ట్ చేసి.. ఓ గ్లింప్స్ కూడా రెడీ చేశారు అని సమాచారం. దసరా సందర్భంగా లేదా ఎం.ఎస్.సుబ్బలక్ష్మి 110వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 16న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.