రామ్ చరణ్ (Ram Charan) , బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్లో రానున్న RC16 (RC16 Movie) చిత్రం మైసూరులోని చాముండేశ్వరి దేవాలయం ఆశీర్వాదాలతో ప్రారంభమైంది. ప్రారంభ వేడుకల తర్వాత షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొదటి షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ఇప్పటికే మైసూరుకు చేరుకున్నారు. అయితే, చరణ్ ఈ రెండు రోజుల పాటు ఇతర నటి నటీనటుల షూటింగ్‌ను నిశితంగా పరిశీలించారు. సోమవారం నుంచి చరణ్ సెట్స్‌లో పూర్తి స్థాయిలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా చేరనున్నారని సమాచారం.
మొదటి షెడ్యూల్లో జాన్వీ పాల్గొనట్లేదని అనుకున్నా, తాజా అప్డేట్ ప్రకారం ఆమె సోమవారం నుంచి షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. చరణ్, జాన్వీ జంటగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు బుచ్చిబాబు సిద్ధమయ్యారు. ఈ 10 రోజుల షెడ్యూల్ మైసూరులోనే పూర్తవుతుందని నిర్మాతలు వెల్లడించారు. షెడ్యూల్ పూర్తి కావడంతో, టీమ్ రెండు మూడు రోజుల విరామం తీసుకుని, తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించనుంది.
బుచ్చిబాబు తన తొలి చిత్రం ఉప్పెనతోనే వేగంగా పనిచేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా తక్కువ కాలంలో పూర్తి చేసి, గ్రాండ్ రిలీజ్ చేయాలని బుచ్చిబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు గురువు సుకుమార్ తక్కువ స్పీడ్‌తో, ఎక్కువ సవాళ్లతో పనిచేసే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పేరు పొందారు. సుకుమార్ ఎప్పటికప్పుడు తన ఆలోచనల్లో మార్పులు చేసి, తగినట్లు సన్నివేశాలను మళ్లీ రూపొందిస్తారు.
కానీ బుచ్చిబాబు తన స్క్రిప్ట్‌ను ముందే పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుని, ఒక ఫిక్స్డ్ ప్లాన్‌తో షూటింగ్‌ను వేగంగా ముగించడంలో దిట్ట అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. RC16 విజయవంతమైతే, బుచ్చిబాబు తన గురువుకు దీటుగా నిలబడతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. RC16 యూనిట్ వేసిన వేగం చూస్తుంటే, మేకర్స్ 2025కు ఈ చిత్రాన్ని సిద్ధం చేసే అవకాశముందని సమాచారం.