హీరోయిన్ కూడా ఓ ఇంట్లో అమ్మాయే!

“అంట.. అనే పునాదిపై ఇండస్ట్రీలో గాసిప్ కోటలు కట్టేస్తున్నారు. నిజం వంగి షూ వేసుకునే లోపల అబద్దం ప్రపంచం మొత్తం చుట్తోస్తుంది. కథానాయికలను ప్రేక్షకుల చూసే దృక్పథం మారాలి” అంటోంది రెజీనా. ఓ యువ కథానాయకుడితో ఈ అమ్మడు సహజీవనం చేస్తుందని, ప్రేమాయణం నడుపుతుందంటూ గతంలో పుకార్లు షికార్లు చేశాయి. గతేడాది డిసెంబర్ లో రెజీనా పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రభ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. సహజీవనం గురించి ప్రశ్నించగా.. “వివాదాలు, పుకార్లపై స్పందించకూడదని నిర్ణయం తీసుకున్నా. అందరూ నీపై ఎందుకు పుకార్లు రావని అడిగేవారు. దీంతో సంతోషంగా ఉంటార”ని నవ్వేసింది. అయితే.. తాజాగా ఓ లఘు చిత్రంలో నటించిందీ భామ. నిజజీవిత పాత్రలోనే కనిపించింది. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట కదా? అని ప్రశ్నించాడు అభిమాని. బదులుగా.. ఇండస్ట్రీలో గాసిప్ లు, తన అభిప్రాయాలూ చెప్పింది. “ఓ నటికి, అభిమానికీ మధ్య ఉన్న చిన్న దూరం ఓ అమ్మాయికి కూడా ఉంటుందనే విషయం మర్చిపోతున్నారు. ఒక్కసారి మేము ఇంటికి వెళితే… చెప్పులతో పాటు స్టార్ డమ్ కూడా వదిలేసి వెళ్లాలి. అప్పుడు మా తల్లిదండ్రులకు ఓ అమ్మాయి లాగా సమాధానం చెప్పాలి. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు” అని విజ్ఞప్తి చేసింది. రంగు రంగు పోస్టర్లను, చిన్న చిన్న బట్టలను దాటి మమ్మల్ని చూడండని కోరింది. సినిమాల్లో వేసుకునే బట్టలను కథానాయికలు బయట కూడా వేసుకుంటారనుకోవడం పొరబాటు అంటోంది. చిత్రసీమలో సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల అభిమానమే నటిగా కొనసాగేందుకు ప్రోత్సాహం ఇస్తుందని చెప్పింది. ‘ఏం చేసుకోవాలో తెలియనంత అభిమానం వద్దు.. ఎప్పుడైనా బాధ వేస్తే, గుర్తు చేసుకునేంత గౌరవం ఇస్తే చాలు” అని సెలవిచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus