గెలుపు కోసం రెజీనా తమిళ పరుగు!

వరుసగా రెండు సినిమాలు నిరాశపరిస్తే ఆ సినిమాలకు పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎంతటి టెన్షన్‌ ఉంటుందో వేరుగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు అలాంటి టెన్షనే రెజీనాకు ఎదురైంది. గోపీచంద్‌ సరసన నటించిన “సౌఖ్యం, మనోజ్‌ సరసన నటించిన “శౌర్య’ చిత్రాలు ఒకదాని తర్వాత మరొకటి నిరాశపరచడంతో రెజీనా ఇప్పుడు కొత్త చిత్రాలను అంగీకరించే విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు సమాచారం.

కెరీర్‌ మొదట్లో “ఎస్‌.ఎం.ఎస్‌., రొటీన్‌ లవ్‌స్టోరీ’ వంటి విజయవంతమైన చిత్రాలు ఆమెను టాలీవుడ్‌లో నిలదొక్కుకునేలా చేశాయి. వాస్తవానికి తన హోమ్‌టౌన్‌ చెన్నై అయినప్పటికీ తెలుగు చిత్రాలకే ఆమె అధిక ప్రాధాన్యమిస్తూ, అడపాదడపా తమిళ చిత్రాలను అంగీకరిస్తున్న విషయం తెలిసిందే.

తెలుగులో ఫెయిల్యూర్స్‌ కారణంగా తన కెరీర్‌ ఏమౌతుందోనన్న అభద్రతతో ఇప్పుడామె తమిళంలో అవకాశాలొస్తే వెంటనే అంగీకరిస్తోందట. తాజాగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఓ హారర్‌ చిత్రాన్ని చేసేందుకు ఆమె అంగీకరించింది. ఎస్‌.జె.సూర్య కథానాయకుడిగా గౌతమ్‌మీనన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంలో తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని ఆమె ఎంతో నమ్మకంతో ఉంది. ఇదిలావుండగా, లోగడ తెలుగులో “ఊహలు గుసగుసలాడే‘ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తాజాగా “జోఅచ్యుతానంద’ చిత్రంతోనైనా టాలీవుడ్‌లో మళ్లీ సక్సెస్‌ బాట పట్టాలని ఆమె కోరుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus