RGV: రణ్‌వీర్‌పై బ్యాన్.. చాలామంది డౌట్.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?
- June 1, 2026 / 11:57 AM ISTByFilmy Focus Desk
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ నిషేధం విధించామని చెప్పింది. ఆ తర్వాత అది నిషేధం కాదు.. ఆయనతో నటించొద్దు అని తమ ఫెడరేషన్‌లో సభ్యులైన నటులకు సూచిస్తున్నాం అని చెప్పింది. దీంతో అసలు నిషేధం ఉందా? లేదా? అనే క్లారిటీ లేదు. అయితే ఇంతలా చర్చనీయాశమైన రణ్‌వీర్ సింగ్ బ్యాన్‌పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఫెడరేషన్‌పైనే నిషేధం విధించాలని కోరారు.
RGV
గాంధీజీ పంథాలో అంటూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ విధించిన నిషేధం చూస్తుంటే.. వారిపై వారే వేసుకునే ఒక జోక్‌లా కనిపిస్తోంది. వాళ్లు చెబుతున్నట్లు ఈ నిర్ణయం పరిశ్రమను, కార్మికులను రక్షించే ప్రయత్నంలా లేదు. ఫెడరేషన్ తమ పట్టును కోల్పోకుండా చూసుకోవడం కోసం చేస్తోన్న చర్యలా కనిపిస్తోందని కామెంట్ చేశారు ఆర్జీవీ. వాళ్లు తమ కార్మికుల తరఫున మాట్లాడుతున్నామని చెబుతున్నారు. కానీ లక్షలాది మందిలో చాలామందికి ఈ వివాదానికి సంబంధించిన నిజాలు తెలియవు అని వర్మ చెప్పారు.

ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఏమీ న్యాయస్థానం కాదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన నియంత్రణ సంస్థ కూడా కాదు. చట్టపరమైన నిబంధనలను పక్కన పెట్టి. ఒక ఎజెండాతో ప్రైవేటుగా సమావేశమయ్యే కొందరు వ్యక్తులు మాత్రమే. ‘ధురంధర్’ సినిమా భారీ విజయంతో రణ్‌వీర్ సింగ్‌కి వచ్చిన క్రేజ్ చూసి భయపడుతున్న కొందరు నటులు ఇందులో సభ్యులుగా ఉన్నారు అని వర్మ తన సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు.
థియేటర్లలో టికెట్లు అమ్ముడయ్యేది రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్ల వల్లే అని అని అన్న రామ్ గోపాల్ వర్మ.. ఇలాంటి సంస్థల వల్ల టికెట్లు తెగవు అని వర్మ అన్నారు. రణ్‌వీర్ లాంటి స్టార్లే ఆ సినిమాకు కార్మికులకు ఉపాధిని కల్పిస్తున్నారని వర్మ తన వాదన వినిపించారు.












