మే మొదటి వారాన్ని టార్గెట్ చేసుకుని కొన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అందులో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్ర పోషించిన ‘శబరి’ మూవీ కూడా ఒకటి. తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న వరలక్ష్మీ చేసిన మొదటి ఉమెన్ సెంట్రిక్ మూవీ కావడంతో ‘శబరి’ పై ప్రేక్షకుల ఫోకస్ పడింది. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : చిన్నప్పుడే తల్లి చనిపోవడం, తండ్రి వేరే పెళ్లి చేసుకోవడంతో ఒంటరిగా ఫీలవుతుంది సంజన(వరలక్ష్మీ శరత్ కుమార్). పెద్దయ్యాక అరవింద్ (Ganesh Venkatraman) (గణేష్ వెంకట్రామన్)ను ప్రేమిస్తుంది. అందుకు తండ్రి, సవతి తల్లి ఒప్పుకోకపోవడంతో వాళ్ళని ఎదిరించి మరీ అరవింద్ ను పెళ్లి చేసుకుంటుంది. అయితే కూతురు రియా (బేబీ నివేక్ష) పుట్టాక.. మనస్పర్థల వల్ల వీళ్ళు విడిపోతారు. మరోపక్క సంజన పుట్టింటికి తిరిగి వెళ్లకుండా ఉపాధి కోసం అవస్తలు పడుతుంటుంది.తర్వాత జాబ్ కొట్టి.. స్నేహితురాలి సాయంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటుంది.
అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో సూర్య (మైమ్ గోపి) (Mime Gopi) అనే సైకో ఈమె జీవితంలోకి ఎంటర్ అవుతాడు. సంజనని చంపేసి.. ఆమె కూతుర్ని ఎత్తుకుపోవాలి అనేది అతని టార్గెట్. దీనికి అడ్డొచ్చిన కొంతమందిని అతను దారుణంగా చంపేస్తాడు? అసలు సూర్యకి సంజనకి సంబంధం ఏంటి? అతని బారి నుండి తనను, తన కూతుర్ని సంజన ఎలా కాపాడుకుంది? అనేది తెలియాలంటే ‘శబరి’ చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంత మంచి నటో అందరికీ తెలుసు. ‘శబరి’ లో ఆమె టైటిల్ రోల్ పోషించింది.ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ రోల్లో వరలక్ష్మీని తెలుగు ప్రేక్షకులు చూడటం ఇదే ఫస్ట్ టైం కావచ్చు. సింగిల్ మదర్ గా తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేసింది వరలక్ష్మీ. ఆమె తర్వాత మైమ్ గోపి పాత్ర గురించి చెప్పుకోవాలి. ఇతన్ని నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లో మనం చూశాం. అయినప్పటికీ ఈ సినిమాలో సైకో పాత్రలో చాలా చక్కగా నటించాడు. అతను కనిపించిన ప్రతి ఫ్రేమ్ భయపెట్టే విధంగా ఉంటుంది.
వరలక్ష్మీకి జోడీగా గణేష్ వెంకట్రామన్ నటించాడు. ఉన్నంతలో అతను తన పాత్రకి న్యాయం చేశాడు. హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో సునయన (Sunaina) , శశాంక్ (Shashank)..లు ఓకే అనిపిస్తారు. పోలీస్ పాత్రలో మధునందన్ , హీరోయిన్ సవతి తల్లి పాత్రలో అర్చన అనంత్, హీరోయిన్ తల్లి పాత్రలో ఆశ్రిత వేముగంటి బాగానే చేశారు. మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : ఓ సింగిల్ మదర్ జీవితాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించడం అనే ఐడియా బాగుంది. దర్శకుడు అనిల్ కాట్జ్ కి ఈ విషయంలో మంచి మార్కులు పడతాయి. సినిమా స్లోగా స్టార్ట్ అయ్యింది. టేకాఫ్ కి కొంచెం టైం తీసుకున్నప్పటికీ.. మధ్య మధ్యలో వచ్చే సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి కథ వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలని రివీల్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా హర్రర్ ఫీల్ కలిగిస్తుంది.
ఇక సెకండాఫ్ స్టార్టింగ్ పోర్షన్ స్లోగా అనిపిస్తుంది. ప్రేక్షకులకి ‘1 నేనొక్కడినే’ ని తలపించేలా ఒకటి, రెండు సీక్వెన్స్ లు ఉంటాయి. అయితే మళ్ళీ ప్రీ క్లైమాక్స్ కి ముందు పోర్షన్ నుండి పికప్ అవుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, వరలక్ష్మీ విలన్ తో పోరాడే విధానం బాగుంటుంది. సినిమాటోగ్రఫీ, గోపీసుందర్ (Gopi Sundar) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్స్ అని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మరీ పొగిడేసే విధంగా ఏమీ లేకపోయినా కథకు తగ్గట్టు.. ఓకే అనిపిస్తాయి.
విశ్లేషణ : మొత్తంగా ‘శబరి’ … థ్రిల్ చేస్తూనే ఎమోషనల్ గా సాగే ఓ సింగిల్ మదర్ స్టోరీ. వరలక్ష్మీ మార్క్ పెర్ఫార్మన్స్ అలరిస్తుంది. ఈ వీకెండ్ కి థియేటర్లలో ట్రై చేయొచ్చు.
రేటింగ్ : 2.5/5