ఓ సినిమా విడుదలను ఆపేయండి అంటూ ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఎందుకంటే ఆ సినిమా పాయింట్ సల్మాన్‌కి చాలా ఏళ్లుగా వెంటాడుతున్న అంశం కాబట్టి. అవును మీ డౌటే కరెక్ట్. సల్మాన్ ఖాన్‌ను గత కొన్నాళ్లుగా కలవరపెడుతున్న కృష్ణ జింకల అంశమే ఆ సినిమా. కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందింది. ఆ సినిమా పేరే ‘కాలా హిరన్: ది బ్యాటల్ ఆఫ్ లెగసీ’. సినిమా పేరు బట్టే కథేంటో అర్థం చేసుకోవచ్చు.
ఆ ‘కాలా హిరన్’ సినిమా విడుదలపైనే సల్మాన్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా దురుద్దేశాన్ని ఆపాదించేలా ఈ సినిమా ఉందనేది సల్మాన్ ఖాన్ అభ్యంతరం. కృష్ణ జింకల కేసు ప్రస్తుతం హైకోర్టులో కమర్షియల్ సూట్ విచారణ పెండింగ్‌లో ఉందని, అది తేలేంత వరకూ సినిమాను విడుదల చేయొద్దని సల్మాన్ ఖాన్ కోరాడు. ఈ సినిమా ప్రచారం, పంపిణీ, ఎగ్జిబిషన్, స్ట్రీమింగ్‌ను ఆపేయాలని ఈ మేరకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని సల్మాన్ ఖాన్ కోరాడు.
ఈ మేరకు ‘కాలా హిరన్’ దర్శకుడు భరత్ శ్రీనేత్, నిర్మాత అమిత్ జానీ, జానీ ఫైర్‌ఫాక్స్ ఫిల్మ్స్, అక్షయ్ పాండే తదితరులకు ఆదేశాలు ఇవ్వాలని సల్మాన్ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశాడు. ఈ సినిమా ప్రచారానికి సంబంధించి తన పేరు ఉపయోగించకపోయినా.. పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూస్తుంటే అందులో ప్రధాన పాత్రధారి ఆహార్యం, హావభావాలు తనను పోలి ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నాడు సల్మాన్ ఖాన్. అభిమానులు, ప్రేక్షకులు సులభంగా గుర్తించేలా అవి ఉన్నాయని కోర్టు దృష్టికి సల్మాన్ తీసుకొచ్చాడు.