టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమంత.. పెళ్లి తరువాత కూడా అంతే జోరుగా సినిమాలు చేస్తుంది. సరికొత్త కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. ‘ఓ బేబీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ అనే సినిమాలో నటించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఆయన కూతురు నిర్మాతగా వ్యవహరిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. దిల్ రాజు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారో.. అప్పటినుండి సినిమా స్కేల్ మారిపోయింది.
అసలు సమంత చేస్తుందో లేదో అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకొని.. సినిమాకి కీలకంగా మారింది. అయితే ఈ సినిమాకి సామ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఉంటుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం సమంత రూ.2.50 కోట్లు తీసుకుందట. నిజానికి ఆమె యాభై లక్షలు తగ్గించి రెమ్యునరేషన్ తీసున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సమంత-నందిని రెడ్డి కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం.. ఈ స్టార్ హీరోయిన్ రూ.3 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేసింది.
అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్ కూడా తీసుకుంది. 2022లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. అయితే ‘శాకుంతలం’ కథ తనకు నచ్చడంతో యాభై లక్షలు తగ్గించుకొని రెండున్నర కోట్లకే సినిమా చేయడానికి అంగీకరించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది సమంత.