సర్కార్

తమిళ సూపర్ స్టార్ విజయ్, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల క్రేజీ కాంబినేషన్ లో “తుపాకి, కత్తి” లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత వచ్చిన చిత్రం “సర్కార్”. పోలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సమకాలీన రాజకీయ అంశాల మేళవింపుగా రూపొందింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే పెరుగుతున్న తరుణంలో విడుదలైన ఈ పోలిటికల్ ఫిల్మ్ జనాల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

కథ : ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీకి సి.ఈ.ఓ పొజిషన్ లో ఉండి నెలకి 1800 వందల కోట్ల మేర ఆర్జిస్తున్న ఓ ప్రఖ్యాత వ్యాపారవేత్త సుందర్ రామస్వామి (విజయ్) తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇండియాకి వస్తాడు. ఎయిర్ పోర్ట్ నుంచి స్ట్రయిట్ గా పోలింగ్ బూత్ కి వెళ్ళిన సుందర్ కి తన ఓటు ఆల్రెడీ ఎవరో దొంగ ఓటు వేశారని తెలుస్తుంది. దాంతో కోర్టును ఆశ్రయించి సెక్షన్ 49P ను వినియోగించుకొని తిరిగి తన ఓటును తానే వేసేలా కోర్ట్ ద్వారా అవకాశం అందిపుచ్చుకుంటాడు. అయితే.. తన ఓటు మాత్రమే కాదని తనలా మొత్తం మూడున్నర లక్షల మంది ఓటు వేయలేకపోయారని తెలుసుకొంటాడు. ఆ కారణంగా ఎలక్షన్ కమిషన్ రీఎలక్షన్ నిర్వహించాలని తీర్పునిస్తుంది.

రాజకీయ స్థితిగతుల్లో భారీ మార్పులు చోటు చేసుకొని రూలింగ్ పార్టీ మాత్రమే కాక ఎలక్షన్స్ లో ఏకగ్రీవంగా ఎన్నికవ్వాల్సిన పార్టీ స్థితిగతులు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కోమరవెల్లి (వరలక్ష్మీ శరత్ కుమార్). ఆమె రాకతో రూలింగ్ పార్టీ పరిస్థితి సర్ధుమనగడమే కాకుండా ఆమె పన్నాగాల పుణ్యమా అని సుందర్ రామస్వామికి జనాల్లో పాపులారిటీ తగ్గిపోతుంది.

ఈ పరిస్థితులను సుందర్ ఎలా ఎదుర్కొన్నాడు? తన కార్పొరేట్ మైండ్ సెట్ తో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా శాసించాడు అనేది “సర్కార్” కథాంశం.

నటీనటుల పనితీరు : విజయ్ క్యారెక్టర్ కి టెర్రీఫిక్ బ్యాక్ డ్రాప్ ఉండడంతో పెద్దగా ఎంట్రీ సీన్స్ లేకుండానే అతడు పోషించిన సుందర్ రామస్వామి పాత్రకి ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. విజయ్ తన మార్క్ మ్యానరిజమ్స్ తో సుందర్ రామస్వామి పాత్రకు న్యాయం చేశాడు. బహిరంగ సభా ప్రాంగణంలో లాఠీ చార్జ్ సీన్ లో విజయ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.
కీర్తి సురేష్ కి కథలో ప్రాముఖ్యత లేకపోయినా.. సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపిస్తూ మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకొంది.

సీనియర్ ఆర్టిస్ట్ రాధారవికి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర లభించింది. చంచల స్వభావుడిగా ఆయన పాత్ర సినిమాకి చాలా కీలకమే కాక ఆయన క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. “పందెం కోడి 2” అనంతరం మరో టెర్రీఫిక్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది వరలక్ష్మీ శరత్ కుమార్. కోమరవెల్లి పాత్రలో ఆమె ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ చేసిన యాక్టింగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సాంకేతికవర్గం పనితీరు : మురుగుదాస్ ఎంచుకొన్న మూలకథ బాగుంది, ఆసక్తికరమైన పాయింట్ కూడా. అయితే.. కథనంతో మాత్రం ఇదివరకట్లా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాడు. విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రల్ని అత్యుద్భుతంగా డిజైన్ చేసుకొన్న మురుగదాస్ మిగతా పాత్రల్ని, కథనాన్ని గాలికొదిలేశాడు. సినిమా అప్పుడే కాస్త ఆసక్తికరంగా సాగుతుంది అనుకొనే తరుణంలో అనవసరమైన అంశాలను జొప్పించి ఉన్న కాస్తంత ఆసక్తి పోయేలా చేశాడు మురుగదాస్.

గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ & లైటింగ్ బాగున్నాయి. టింట్ & కలర్ టోన్ పరంగా తీసుకొన్న జాగ్రత్తలు కూడా ప్రశంసనీయం. రెహమాన్ అందించిన బాణీలు అర్ధం కానీ సాహిత్యం కారణంగా వేస్ట్ అయిపోగా.. నేపధ్య సంగీతం పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.

మురుగదాస్ సినిమాలెప్పుడు సమాజంలోని ఏదో ఒక సమస్యను వేలెత్తి చూపడమే కాక చక్కని పరిష్కారం కూడా చూపుతాయి. ఈ సినిమాలోనూ సమకాలీన రాజకీయ మరియు సమాజంలో జరుగుతున్న సమస్యలను చూపడమే కాక వాటిపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది వ్యగ్యంగా చూపించాడు మురుగదాస్. అక్కడివరకూ బాగానే ఉంది. కానీ.. సినిమాకి చాలా కీలకమైన అంశాలను మాత్రం పట్టించుకోలేదు. కమర్షియల్ అంశాలను, ఫ్యాన్ మూమెంట్స్ ను సినిమాలో ఇరికించే ప్రయత్నంలో దారుణంగా దెబ్బతిన్నాడు.

విశ్లేషణ : ఒక రాజకీయ నేపధ్యంలో సాగే సినిమాకి కావాల్సింది మంచి పాయింట్ మాత్రమే కాదు.. అద్భుతమైన కథనం కూడా. మొదటిది ఉన్నప్పటికీ.. రెండో పాయింట్ లోపించిన “సర్కార్” విజయ్ ఫ్యాన్స్ ను ఓ మోస్తరుగా ఆకట్టుకోవచ్చు కానీ.. జనరల్ ఆడియన్స్ ను అలరించడం కాస్త కష్టమే.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus