కొబ్బరి కాయ కొట్టకుండానే.. సినిమా షూటింగ్ ప్రారంభం.. ఈ మాట వినడానికి కొత్తగా ఉన్నా ఇలాంటి పరిస్థితిలో కొన్ని సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు, చేయబోతున్నారు అని మొన్నీమధ్యే అనుకున్నాం గుర్తుందా? పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘వినోదాయ చిత్తాం’ రీమేక్ విషయంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకున్నాం. అయితే ఆ పని షురూ కాకుండానే మరో సినిమా అచ్చంగా అలానే మొదలైపోయింది అంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలు ఒకే నిర్మాణ సంస్థలోనివే కావడం గమనార్హం.
శర్వానంద్ – కృష్ణచైతన్య కాంబినేషన్లో కొన్నాళ్ల క్రితం ఓ సినిమా మొదలైంది. అయితే ఇప్పుడు శర్వానంద్ ఆ సినిమా షూటింగ్లో లేడని సమాచారం. ఆ మాటకొస్తే ఆ సినిమా సంగతేంటి అనేది కూడా తెలియడం లేదని టాక్. కారణం ఏంటంటే ప్రస్తుతం శరవ్ఆనంద్ మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అదేంటి.. శర్వా ఇంకే సినిమా స్టార్ట్ చేయలేదు కదా. ఎలాంటి ఓపెనింగ్స్ కూడా జరగలేదు కదా ఇటీవల అంటారా? అవును మీరు చెప్పింది కరెక్టే. ఓపెనింగ్ జరగలేదు. కానీ షూటింగ్ మొదలైంది అని టాక్.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా స్టార్ట్ చేశాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ‘శమంతకమణి’, ‘భలే మంచి రోజు’, ‘దేవదాస్’, ‘హీరో’ లాంటి సినిమాలు తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య కొత్త సినిమా మొదలైందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోందట. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టిని తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందని టాక్ నడుస్తోంది. అయితే ఎందుకిలా సైలెంట్‌గా మొదలుపెట్టారు అనేది తెలియాల్సి ఉంది.
కృష్ణ చైతన్య సినిమాకు గ్యాప్ ఇచ్చారా? లేక ఇంకేదైనా ఆలోచన ఉందా అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా కృష్ణ చైతన్య సినిమా ఇలానే ఒకటి మొదలై మళ్లీ ఆగిపోయింది. ఆ విషయం పక్కనపెడితే పవన్ కల్యాణ్ – సాయిధరమ్ తేజ్ – సముద్రఖని – త్రివిక్రమ్‌ల ‘వినోదాయ చిత్తాం’ రీమేక్ కూడా ఇలానే స్టార్ట్ చేస్తారని టాక్ వచ్చింది. అదెప్పుడు ఉంటుందో చూడాలి.