యువ హీరో శర్వానంద్ చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ విజయాలను సొంతంచేసుకుంటున్నారు. రీసెంట్ గా మారుతీ దర్శకత్వంలో మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న శర్వా .. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ విజయం తర్వాత హను రాఘవపూడి చేసిన లై మూవీ నిరాశపరచడంతో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని హను మంచి లవ్ స్టోరీని తీసుకున్నట్లు తెలిసింది. హీరోయిన్ గా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోన్న ఈ మూవీకి “పడి పడి లేచే మనసు” అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు శర్వానంద్.
సుధీర్ వర్మ దర్శకత్వంలో 28 వ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒకటి లవర్ బాయ్ కాగా.. మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను విశాఖలో ప్రారంభించారు. 1980ల కాలంలో జరగనున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇందులో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్లు తెలిసింది. ఈ పాత్రతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఎంతమేర అలరిస్తారో చూడాలి.