తెలుగులో రైటర్లు కరువయ్యారా లేక ఉన్న రైటర్లకి ఐడియాలు రావడం లేదా లేక అంత టైమ్ ఉండడం లేదా అనే ప్రశ్నలకు సమాధానం లేదు కానీ.. ఈమధ్యకాలంలో రీమేక్ లు ఎక్కువయ్యాయన్నది మాత్రం నిజం. రీమేక్ లు మనకేమీ కొత్త కాదు, చేయవద్దు అని కూడా చెప్పడం లేదు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు సక్సెస్ లు సాధించిన సినిమాలన్నీ రీమేక్ లే. అయితే.. ఈమధ్యకాలంలో తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలను రీమేక్ చేయడం కాస్త ఎక్కువైంది. మరీ విచిత్రం ఏంటంటే.. సదరు తమిళ చిత్రం డబ్బింగ్ రూపంలో ఆల్రెడీ తెలుగులో విడుదలైనా కూడా.. మళ్ళీ అదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన “కాటమరాయుడు” సినిమా ఇందుకు ఉదాహరణ. తమిళంలో అజిత్ నటించగా మంచి సక్సెస్ సొంతం చేసుకొన్న “వీరం” చిత్రం తెలుగులో “వీరుడొక్కడే”గా విడుదలైంది.
మళ్ళీ అదే చిత్రాన్ని తెలుగులో “కాటమరాయుడు”గా రూపొందించాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇదే తరహాలో తమిళ కామెడీ ఎంటర్ టైనర్ “వేలైను వందుట్టా వెల్లైకారన్” అనే చిత్రానికి రీమేక్ గా అల్లరి నరేష్-సునీల్ హీరోలుగా భీమనేని శ్రీనివాసరావు “సిల్లీ ఫెలోస్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ తమిళ చిత్రం ఆల్రెడీ తెలుగులో “ప్రేమ లీలా పెళ్లి గోల” అనే పేరుతో అనువదించబడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్ళీ తెలుగులో రీమేక్ చేసి విడుదల చేయడంలో ఉపయోగం ఏముందో ఎవరికీ అర్ధం కావడం లేదు. అసలే అల్లరి నరేష్-సునీల్ లు హిట్ అనే పదం విని చాలా ఏళ్ళవుతోంది. అలాంటిది మళ్ళీ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమాతో ఇలాంటి సీలీ మిస్టేక్ చేయడం ఎందుకో?