తమిళంలో మంచి విజయం సాధించిన “వేలైను వందుట్ట వెల్లైకారన్” అనే చిత్రానికి రీమేక్ గా రూపొందిన చిత్రం “సిల్లీ ఫెలోస్”. అల్లరి నరేష్-సునీల్ ల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు ఎనిమిదేళ్ళ విరామం అనంతరం కలిసి నటించిన చిత్రమిది. ఈ కామెడీ రీమేక్ కి భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. తమిళనాట ప్రేక్షకుల్ని విశేషంగా నవ్వించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : సత్యనారాయణపురం అనే గ్రామంలో టైలర్ గా పనిచేసే వీరబాబు (అల్లరి నరేష్), అదే ఊర్లో జులాయిగా తిరిగే సూరిబాబు (సునీల్) మంచి స్నేహితులు. తమ ఏరియా ఎమ్మెల్యే జాకెట్టు (జయప్రకాష్ రెడ్డి)కి చేయదలుచుకున్న సామూహిక వివాహ కార్యక్రమంలో ఉండాల్సిన 25 మంది జంటల్లో 7 అబ్బాయిలు, 1 అమ్మాయి పారిపోవడంతో ఆఖరి నిమిషంలో ఆ జంటల్లో సూరిబాబును కూడా చేర్చి అతడికి రికార్డింగ్ డ్యాన్సర్ పుష్ప (నందిని రాయ్)తో పెళ్లి చేస్తాడు. కానీ.. అప్పుడే కృష్ణవేణి (పూర్ణ)తో పెళ్ళికి సిద్ధమైన సూరిబాబుకి పుష్పతో పెళ్లి పబ్లిక్ అయిపోవడంతో కొత్త సమస్యలు వచ్చిపడతాయి.
వీరబాబు కూడా అదే ఊర్లో టిఫిన్ సెంటర్ ఓనర్ కూతురైన వాసంతి (చిత్ర శుక్ల)ను ప్రేమిస్తాడు. ఆమెను పోలీస్ చేస్తానంటూ ఆమె తల్లిని నమ్మబలికి ఆమె నుంచి 10 లక్షలు తీసుకొని ఎమ్మేల్యేకి ఇస్తాడు. అయితే.. అటు సూరిబాబు, ఇటు వీరబాబుల జీవితాలకు సుఖాంతం పలకాల్సిన ఎమ్మెల్యే ఒక యాక్సిడెంట్ కారణంగా గతం మర్చిపోవడంతో అసలు సమస్య మొదలవుతుంది. ఎమ్మెల్యేకి మళ్ళీ గతం గుర్తుకొచ్చిందా? సూరిబాబు పొరపాటున పెళ్లాడిన పుష్పకు విడాకులిచ్చి తాను ఇష్టపడిన కృష్ణవేణికి తాళి కట్టాడా? వీరబాబు-వాసంతిల ప్రేమ ఫలించిందా? వంటి ప్రశ్నలకు సరదాగా చెప్పిన సమాధానాల సమాహారం “సిల్లీ ఫెలోస్” చిత్రం.
నటీనటుల పనితీరు : అల్లరి నరేష్ తన పాత్రలో ఎప్పట్లానే చలాకీగా నటించేశాడు. అయితే.. ఇంతకుముందు అతడిలో కనబడిన కామెడీ టైమింగ్ ఇప్పుడు మిస్ అయ్యింది. అదే తరహా పాత్రలు వరుసబెట్టి చేయడం వల్లనో లేక మరింకేదైనా కారణమో తెలియదు కానీ.. పెద్దగా కష్టపడకుండా అయిపోయింది అనిపించాడు. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ చాలాకాలం తర్వాత సునీల్ కమెడియన్ గా కనిపించాడు. మరీ తన మునుపటి సినిమాల స్థాయిలో యాక్టివ్ గా యాక్ట్ చేయకపోయినప్పటికీ.. పాత సునీల్ ను మళ్ళీ చూశామన్న ఆనందాన్ని మాత్రం ప్రేక్షకులకి మిగిల్చాడు. చిత్ర శుక్ల అందంగా కనిపించింది కానీ.. అభినయంతో అలరించలేకపోయింది. తెలుగమ్మాయి నందిని రాయ్ తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోకుండా ఉంటే బాగుండేది. తమిళం ఒరిజినల్లో భీభత్సమైన కామెడీని పంచే పుష్ప పాత్రలో ఆమె మెప్పించలేకపోయింది. జయప్రకాష్ రెడ్డి పాత్ర ఓ మోస్తరుగా అలరించింది. పోసాని కూడా నవ్వించడానికి కాస్త గట్టిగానే కష్టపడ్డాడు.
సాంకేతికవర్గం పనితీరు : శ్రీవసంత్ సంగీతం, అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే.. దర్శకుడు క్లైమాక్స్ మినహా ఎక్కడా చిన్న మార్పు కూడా చేయకుండా తమిళ వెర్షన్ ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయడం మైనస్ గా మారింది. నరేష్-సునీల్ లాంటి కామెడీ జనరేటర్స్ ను పెట్టుకొని సాదాసీదా కథనంతో సినిమాని నడిపించడం బాధాకరం. అయినా.. ఆల్రెడీ తెలుగులో విడుదలై హైద్రాబాద్ లోనే ఒక రెండు వారాలు ఆడిన “ప్రేమ లీల పెళ్లి గోల” చిత్రాన్ని మళ్ళీ కష్టపడి తెలుగులో రీమేక్ చేయాల్సిన అవసరం ఏమోచ్చింది? కథలు దొరకడం లేదా లేక అర్జెంట్ గా నరేష్-సునీల్ కాంబినేషన్ లో సినిమా చేయకపోతే ఆడియన్స్ కొడతామని ఏమైనా బెదిరించారా?.
ఏదేమైనా రీమేక్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు మరోమారు తడబడ్డారు. కథ-కథనం అనేది ఎలాగూ ఆకట్టుకోదు కాబట్టి ఉన్న ఆ కొన్ని కామెడీ సీన్లు కూడా కేవలం కొందర్ని మాత్రమే అలరిస్తాయి కాబట్టి “సిల్లీ ఫెలోస్” ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.
విశ్లేషణ : సిల్లీ కథ, సిల్లీ పెర్ఫార్మెన్సెస్, సిల్లీ కామెడీతో రూపొందిన ఈ “సిల్లీ ఫెలోస్”ను సిల్లీగా ఒకసారి చూడాలి తప్పితే.. సీరియస్ నవ్విస్తుందని ఆశించి థియేటర్ కి వెళ్తే మాత్రం నీరసపడడం ఖాయం.
రేటింగ్ : 2/5