లైంగిక వేధింపుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన చిన్మయి

  • October 8, 2018 / 11:26 AM IST

భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నా.. మహిళలు మగవారితో పోటీ పడుతున్నా.. అడుగడుగునా జరుగుతున్న అకృత్యాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి. రోజుకు ఏదో మూల.. వయసుతో సంబంధం లేకుండా మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయి. దానికోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆడపిల్ల ఇంటికి తిరిగివచ్చేవరకు తల్లిదండ్రులు హాయిగా నిద్రపోవడం లేదు. ఈ విషయంపై ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నప్పుడు తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాయని వెల్లడించింది. “8-9 ఏళ్ల వయస్సులో అమ్మతో కలిసి ఒక రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లాను. అక్కడ నేను నిద్రపోతున్నప్పుడు ఎవరో తడుముతున్నట్టు గుర్తించాను.

అలాగే 10-11 ఏళ్ల వయసప్పుడు డిసెంబర్‌ సంగీత కచేరీ చూస్తుండగా ఒక ముసలాయన నా తొడపై గిల్లాడు” అని గుర్తుచేసుకొని బాధపడింది. తాను పెద్దయ్యాక కూడా లైంగిక వేధింపులు తగ్గలేదని వెల్లడించింది. “కొన్నేళ్ళక్రితం నా అభిప్రాయాలకు మద్ధతు తెలిపే నెపంతో ఒక వ్యక్తి మాటలతోనే లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. డార్లింగ్‌, స్వీట్‌హార్ట్‌ అంటూ పిలవడంతో అతన్ని దూరంగా పెట్టాను. అందుకే ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు” అని ట్వీట్స్ ద్వారా చిన్మయి తెలిపింది. ఈ విషయం గురించి నలుగురిలో మాట్లాడడం వల్ల లైంగిక దాడులు తగ్గే ఆస్కారం ఉందని సూచిస్తున్నారు. అవగాహనతోనే ఆకృత్యాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చని చిన్మయి లాంటి సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus