Love Me: యూట్యూబర్‌ – దెయ్యం ప్రేమ… ‘లవ్‌మీ’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయట!

‘దెయ్యంతో ప్రేమాయణం’ మామూలుగా అయితే ఏదో జోక్‌గా ఈ మాటలు అంటుంటారు. మనం వింటుంటాం కూడా. అయితే ఇదే కాన్సెప్ట్‌ను సీరియస్‌ సినిమా కథగా తీసుకుని చేసిన చిత్రం ‘లవ్‌ మీ : ఇఫ్‌ యు డేర్‌’ (Love Me) . ఆశిష్‌ రెడ్డి (Ashish Reddy)  ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కథానాయిక. అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆశిష్‌ మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.

దెయ్యం నేపథ్యంలో సినిమాలు మనకు కొత్త కాదు. అయితే ప్రతీకారం చుట్టూనే ఆ సినిమాలు ఉంటూ ఉంటాయి. ఈ సినిమా కాస్త భిన్నం. దెయ్యం నేపథ్యం ఉన్నప్పటికీ హారర్‌ అనేది ఓ భాగం మాత్రమే. మంచి ప్రేమకథలా సినిమా సాగుతుంది. ఈ సినిమాకు ముందు ఆశిష్‌ ‘చంద్రముఖి’ (Chandramukhi), ‘ముని’ తరహా సినిమాలు చూశారట. వాటిలా ఈ సినిమా ఉండదు అని చెబుతున్నారు. ఈ సినిమాలో తానొక యూట్యూబర్‌గా కనిపిస్తానని చెప్పాడు ఆశిష్‌.

యూట్యూబ్‌ వీడియోస్‌ చేసుకునే హీరో దగ్గరకు దెయ్యానికి సంబంధించిన ఓ స్టోరీ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా కథ. వైష్ణవి ఈ సినిమాలో దెయ్యం అయినా.. హీరోయినే అని చెప్పాడు ఆశిష్‌. అదెలా అనేది సినిమాలోనే చూడాలి అని అంటున్నాడు. ఇక ఈ సినిమాలో ఐదారుగురు హీరోయిన్లు ఉన్నారని, ఆ మ్యాజిక్‌ కూడా వెండితెర మీదనే చూడాలి అని అంటున్నాడు. అంతేకాదు ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకొన్ని ఉన్నాయని చెప్పాడు.

సినిమా క్లైమాక్స్‌లో ఓ మలుపు ఉందని, అది సినిమాకు సీక్వెల్‌ తీసుకొస్తుందని చెప్పాడు ఆశిష్‌. అయితే మరి సీక్వెల్‌ చిత్రం ఉంటుందా లేదా అనేది నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు. అంటే ఆశిష్‌ డైరెక్ట్‌గా చెప్పలేదు కానీ.. ఈ సినిమా ఫలితం మీదే ఆ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. చూద్దాం మరొక రోజు మాత్రమే ఫలితానికి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus