ప్రముఖ తమిళ కథానాయకుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సినిమా ‘జన నాయగన్’ పైరసీ భూతం కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. సినిమా ఫుల్ క్వాలిటీ వీడియో బయటకు వచ్చేసింది. అందులో కొన్ని సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. చిత్రబృందం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఆరుగురుని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం లాయర్ పోస్ట్ ద్వారా తెలిపారు.
సినిమాను లీక్ చేసినందుకు సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. లీకైన సీన్‌లను సోషల్ మీడియా ద్వారా ఏ రూపంలో డౌన్‌లోడ్ చేసినా, షేర్ చేసినా వారిపైనా చర్యలు తీసుకుంటాం. పైరసీ వీడియోలను ఫార్వర్డ్ చేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటాం అని ‘జన నాగయన్’ లాయర్ నోటీసులు విడుదల చేశారు. ఈ మేరకు కొన్ని డిజిటల్ పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
విజయ్ చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సంక్రంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ కారవడంలో జాప్యం కారణంగా విడుదలపై క్లారిటీ రావడం లేదు. ఈలోపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. దీంతో ఎన్నికలు అయ్యేంతవరకు సినిమాను విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉండగా ఎవరో సినిమాను లీక్ చేసేశారు. దీనిపై విజయ్‌కి పరిశ్రమ నుండి పూర్తి మద్దతు లభించింది.
ఇక సినిమా లీక్ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రికి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఈ విషయంలో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. మీ కుటుంబానికి చెందిన వారే ఈ సినిమా లీక్ చేశారని టీవీకే జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున అంటున్నారు కదా అని అడగ్గా ‘అవునా.. నాకు తెలియదు. ఆధవ్ అర్జున గురించి వచ్చిన వార్తలు నేను చదవలేదు’ అని సీఎం స్టాలిన్ బదులిచ్చారు.