నటి, అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) భార్య శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందింది. ఒకప్పుడు తాను నటుడితో ఎప్పటికీ డేటింగ్ చేయనని చెప్పిన ఆమె.. ఇప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరించింది. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అభిప్రాయాలు మారడం సహజమేనని, తన విషయంలోనూ అదే జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన పాత వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నటులతో డేటింగ్ విషయంలో తాను భిన్న అభిప్రాయాలతో ఉన్నానని అంగీకరించింది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తాను చూసిన అనుభవాల ప్రభావంతోనే అలా ఆలోచించి ఉండొచ్చని చెప్పింది. వయసు, అనుభవం పెరిగేకొద్దీ మన ఆలోచనా విధానంలో మార్పులు రావడం సహజమని చెప్పుకొచ్చింది.
ఓ దశలో ఉన్న అభిప్రాయమే జీవితాంతం కొనసాగించాల్సిన అవసరం లేదని.. కొత్త అనుభవాల నుంచి నేర్చుకుని అభిప్రాయాలను మార్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టంచేసింది. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంపై తనకు ఎలాంటి భయం లేదని శోభిత తెలిపింది. ఒకే అభిప్రాయానికి జీవితాంతం కట్టుబడి ఉండటమే గొప్ప విషయం కాదని, పరిస్థితులను అర్థం చేసుకుని అవసరమైనప్పుడు తన ఆలోచనలను మార్చుకోవడం కూడా ఎదుగుదలలో భాగమేనని తెలిపింది. వేర్వేరు సమయాల్లో నాకు వేర్వేరు అభిప్రాయాలు ఉండటాన్ని నేను అంగీకరిస్తాను.. కొత్త అనుభవాలకు అనుగుణంగా మారడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదనే భావనను ఆమె వ్యక్తపరిచింది.
మరోవైపు ప్రేమపై తన అభిప్రాయాన్ని కూడా శోభిత (Sobhita Dhulipala) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రేమను కేవలం రొమాంటిక్ రిలేషన్షిప్గా చూడటం తనకు ఇష్టం లేదని చెప్పింది. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదని.. మనసుల కలయిక, మనలో జరిగే ఒక స్పందన అని అభిప్రాయపడింది. అందుకే ప్రేమను ఒక నిర్దిష్ట నిర్వచనంలో బంధించలేమని, కాలంతో పాటు ప్రేమను చూసే విధానం కూడా మారుతుందని శోభిత చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.నాగచైతన్యతో వివాహం తర్వాత తన వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో మరింత ఆసక్తి పెరగడంపైనా శోభిత (Sobhita Dhulipala) స్పందించింది. సెలబ్రిటీల గురించి సమాజంలో అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని చెప్పింది. సమాజం వాతావరణంలాంటిదని.. వాతావరణం ఎలా వస్తూ పోతుంటుందో.. ప్రజల అభిప్రాయాలు కూడా అలాగే మారుతుంటాయని.. ఆ మార్పులను మన వ్యక్తిత్వంతో ముడిపెట్టుకుంటే పరిస్థితులు మారినప్పుడు మనం కూడా తికమకపడతామని చెప్పింది. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారనే దానికంటే.. తాను ఎవరో తనకు స్పష్టంగా తెలుసుకోవడం ముఖ్యమని చెప్పింది.
శోభిత ధూళిపాళ్ల, (Sobhita Dhulipala) నాగచైతన్య (Naga Chaitanya) 2022లో డేటింగ్ ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరూ తమ బంధాన్ని చాలా కాలం వరకు ప్రైవేట్గానే ఉంచారు. 2024 ఆగస్టు 8న హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని మధురమైన క్షణాలను మాత్రమే అభిమానులతో పంచుకుంటున్నారు. చివరగా సినిమాలా విషయానికొస్తే.. శోభిత ధూళిపాళ్ల ఇటీవల క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం ఆమె దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వెట్టువం’ చిత్రంలో నటిస్తుంది.