Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

టాలీవుడ్‌ కొత్త స్టార్‌ కపుల్‌ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika) తమ ప్రేమ, పెళ్లి సంబంధించిన అనేక పర్సనల్ విషయాలపై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. ఇందులో తమ ప్రేమ దాదాపు 8 ఏళ్ళ పాటు కొనసాగిందని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. తమ రిలేషన్‌షిప్‌ను ఇన్నాళ్లూ ఎందుకు ప్రైవేట్‌గా ఉంచారనే విషయంపై తాజాగా స్పందించారు. తమ ప్రేమ, పెళ్లి, భావాలను వ్యక్తపరచడం, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకోవడం వంటి అంశాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Vijay Deverakonda, Rashmika

ఇందులో భాగంగానే తమ రిలేషన్‌షిప్‌ను దాచేందుకు ఎలాంటి దాగుడుమూతలు ఆడలేదని విజయ్ దేవరకొండ స్పష్టంచేశారు. రష్మికతో తన పరిచయం కోస్టార్లుగా మొదలై.. ఆ తర్వాత స్నేహంగా, ప్రేమగా మారిందని తెలిపారు. తాను, రష్మిక ఎనిమిదేళ్ల క్రితం కోస్టార్లుగా కలిశాం. ముందు స్నేహితులయ్యాం. ఆ తర్వాత ప్రేమలో పడ్డాం. ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. ఇందులో దాగుడుమూతలు ఏమీ లేవు. ఇది నా జీవితం.. ఇతరులతో నేనెందుకు చర్చించాలని విజయ్ అన్నారు.

మరోవైపు రష్మిక కూడా ఇదే విషయాన్ని మరో కోణంలో వివరించారు. తమ బంధం ఇతరుల వినోదం కోసం కాదని, జీవితంలో తాము కాపాడుకోవాలనుకునే విషయాలను ప్రైవేట్‌గా ఉంచుతామని చెప్పుకొచ్చింది. ప్రేమను దాచడం కాదని.. తమకు సంబంధించిన కొన్ని విషయాలను తమ వరకే పరిమితం చేసుకోవడమేనని ఈ సందర్బంగా ఆమె చెప్పకనే చెప్పారు. రిలేషన్‌షిప్‌లో ప్రేమను నిలబెట్టుకోవడానికి పెద్ద పెద్ద విషయాల కంటే చిన్న చిన్న ప్రయత్నాలే ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. భాగస్వామిపై ప్రేమ, శ్రద్ధ ఉన్నాయని మాటల్లోనూ, చేతల్లోనూ తెలియజేస్తూ ఉండటమే నిజమైన ప్రేమకు గుర్తు అని రష్మిక అన్నారు.

భావాలను వ్యక్తపరిచే విషయంలో రష్మిక తనకంటే మెచ్యూర్‌ అని విజయ్‌ చెప్పుకొచ్చాడు. రష్మిక రోజుకు కనీసం 10 నుంచి 15 సార్లు ‘ఐ లవ్ యూ’ చెబుతుందని తెలిపాడు. ‘‘నా మనసులో ప్రేమ ఉంది కాబట్టి ఆమెకు అది తెలుసు కదా.. మళ్లీ మళ్లీ చెప్పడం ఎందుకు అని నేను అనుకుంటాను. కానీ రష్మిక మాత్రం మన భావాలను ఎప్పటికప్పుడు బయటకు చెప్పాలని అంటుంది’’ అని విజయ్‌ అన్నారు. అలాగే రష్మికను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా విజయ్‌ ఆసక్తికరంగా వివరిస్తూ.. ఎన్నో సంవత్సరాలుగా ఆమెను తెలుసుకున్న తర్వాత, జీవితంలోని సాధారణ క్షణాలు కూడా రష్మిక తనతో ఉన్నప్పుడు మరింత ఆనందంగా అనిపించేవని గుర్తించినట్లు చెప్పారు.

కలిసి భోజనం చేయడం, పని చేయడం, ట్రైనింగ్‌ వంటి సాధారణ విషయాల్లోనూ ఆమెతో ఉండటం తనకు ప్రత్యేకంగా అనిపించేదని విజయ్‌ తెలిపారు. ఒక దశలో జీవితంలోని చిన్న చిన్న సందర్భాల్లోనూ ఆమెను మిస్‌ అవుతున్నాననే భావన కలిగిందని, అప్పుడే ‘‘మనిద్దరం పెళ్లి చేసుకుందాం’’ అనే ఆలోచన వచ్చిందని వెల్లడించారు.

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus