Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్
- May 8, 2026 / 05:03 PM ISTByFilmy Focus Desk
సెలబ్రిటీల వ్యక్తిగత, వృత్తిగత ప్రదర్శనలు కాకుండా సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యను బట్టి వారి పరపతిని లెక్కిస్తున్న రోజులివి. మీ హీరోకి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు, మీ హీరోయిన్ ఇన్‌స్టా అనుచరులు ఎంత అని ఫ్యాన్స్ అడుగుతున్న, లేనిపోని చర్చలకు దిగుతున్న ఉదంతాలను చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సెలబ్రిటీల ఇన్‌స్ఆగ్రామ్ అకౌంట్ల ఫాలోవర్లు అమాంతం తగ్గిపోయారు. వందలు వేలల్లో కాదు మిలియన్ల కొద్దీ ఫాలోవర్ల కౌంట్ తగ్గిపోయింది.
ఈ ఊహించని పరిణామానికి సెలబ్రిటీలే కాదు, అభిమానులు కూడా కంగుతిన్నారు. గత రెండు రోజులుగా దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ అయినా మెటా భారీ స్థాయిలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని సమాచారం. అందులో భాగంగా ఫేక్ ఖాతాలు, ఇన్ యాక్టివ్ ఖాతాలు, బాట్ ఖాతాలను తొలగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు రెండు మిలియన్ల ఫాలోవర్లు, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రెండు మిలియన్ల అనుచరులు తగ్గిపోయారు. ప్రముఖ ఫుల్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టా ఖాతా నుండి 8 మిలియన్ ఫాలోవర్లు ఎగిరిపోయారు. అమెరికన్ బిజినెస్ ఉమెన్ కైలీ జెన్నర్ 14 మిలియన్ల ఫాలోవర్స్‌ను కోల్పోయారని సమాచారం. అరియానా గ్రాండే, బేయోన్స్, టేలర్ స్విఫ్ట్, జస్టిన్ బీబర్, కె-పాప్ సెన్సేషన్స్, బీటీఎస్, బ్లాక్‌పింక్ ఖాతాల ఫాలోవర్లు కూడా బాగా తగ్గిపోయారు.
స్పామ్ యాక్టివిటీ, ఫేక్ ఎంగేజ్‌మెంట్, థర్డ్ పార్టీ ఫాలోవర్స్, బూస్టింగ్ సర్వీసెస్‌లు వాడుతున్న ఖాతాలను మెటా ఇటీవల నిలిపివేయడమే దీనికి కారణమని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి వెనుక ఆ సెలబ్రిటీలు ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫేక్ ఖాతాలు, బాట్ ఖాతాలతో ఫాలోవర్ల సంఖ్యను పెంచేసి చూపించుకుంటున్నారు అని మన సెలబ్రిటీల మీద పెద్ద అపవాదు ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు ఈ ఖాతాల కోత దానికి ఊతమిచ్చేలా ఉంది.










