మహేశ్ సోదరి మంజుల మెగాఫోన్ పట్టనున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ‘షో’, ‘కావ్యాస్ డైరీ’, ‘ఆరెంజ్’ తదితర చిత్రాలలో నటించి మరోవైపు నిర్మాతగానూ ‘నాని’, ‘ఏ మాయ చేశావే’ వంటి సినిమాలు చేసిన మంజుల త్వరలోనే కెప్టెన్ కుర్చీలో ఎక్కనున్నారు. కొద్దిరోజుల క్రితం మంజుల తెరకెక్కించనున్న తొలి సినిమాలో నాని హీరోగా నటిస్తాడని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ స్థానంలోకి మరో యువ హీరో వచ్చి చేరాడు.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరువాత ఆ స్థాయి అందుకోవాలని తపిస్తున్న సందీప్ కిషన్ ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి ముందు మొదలెట్టిన రెండు తమిళ సినిమాలు కూడా పూర్తి కావచ్చాయి. చేతిలో మరో సినిమా లేదనుకునేలోపు మంజుల సందీప్ కి తన కథను చెప్పారట. కథ విన్న సందీప్ తన సానుకూలంగానే స్పందించాడట. అన్నీ కలిసొస్తే ఇదే సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. జెమిని కిరణ్ ఈ సినిమాని నిర్మించనున్నట్టు సమాచారం.