Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Cast & Crew

  • సందీప్ కిష‌న్‌ (Hero)
  • మిథిలా పాల్క‌ర్‌, మాన‌స చౌద‌రి (Heroine)
  • ముర‌ళీ శ‌ర్మ‌, సంపూర్ణేష్ బాబు, గెట‌ప్ శీను, జీవ‌న్‌, దివ్యా పిళ్లై త‌దిత‌రులు (Cast)
  • మ‌ల్లిక్ రామ్‌ (Director)
  • రాజీవ్ చిలుక‌, భ‌ర‌త్ ల‌క్ష్మిప‌తి (Producer)
  • అనుదీప్ దేవ్‌ (Music)
  • అరోన్‌, కైస‌ర్ అలం (Cinematography)
  • NA (Editor)
  • Release Date : 2nd జూలై 2026
  • చిలుకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Banner)

తెలుగులో సందీప్ కిష‌న్ చేసిన ఫ‌స్ట్ వెబ్‌సిరీస్ సూప‌ర్ సుబ్బు గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. డీజే టిల్లు ఫేమ్ మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్‌లో మాన‌స చౌద‌రి, మిథిలా పాల్క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. రాజీవ్ చిలుక‌, భ‌ర‌త్ ల‌క్ష్మిప‌తి ఈ సిరీస్‌ను నిర్మించారు. అడ‌ల్ట్ కామెడీగా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందంటే?

Super Subbu Web-Series Review

క‌థ‌: సుబ్బు (సందీప్ కిష‌న్‌) అలియాస్ సుబ్ర‌హ్మ‌ణ్యం తండ్రి రిక‌మండేష‌న్‌తో కంప్యూట‌ర్ ల్యాబ్ అసిస్టెంట్‌గా ఓ స్కూల్‌లో టెంప‌ర‌రీ జాబ్ చేస్తుంటాడు. తండ్రి కుక్కుటేశ్వ‌ర‌రావు (ముర‌ళీ శ‌ర్మ‌) హెడ్మాస్ట‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అవుతాడు . కొడుకును అనుక్ష‌ణం ద్వేషిస్తూనే ఉంటాడు. సుబ్బు ప‌నిచేసే స్కూల్‌కు డీఈఓ చెకింగ్‌కు వ‌స్తాడు. తెలియ‌క చేసిన ఓ త‌ప్పు కార‌ణంగా సుబ్బు ఉద్యోగం పోయే ప‌రిస్థితి వ‌స్తుంది. తండ్రి తిట్ల దండ‌కం నుంచి త‌ప్పించుకోవ‌డానికి సెక్స్ ఎడ్యుకేష‌న్‌ ఆఫీస‌ర్‌గా ప‌నిచేయ‌డానికి మాకీపూర్ అనే ఊరికి వెళ్ల‌డానికి సుబ్బు అంగీక‌రిస్తాడు. అప్ప‌టికే సుబ్బుకు దివ్య (మాన‌స చౌద‌రి) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స‌వుతుంది.

జాబ్ ప‌ర్మినెంట్ అయితేనే పెళ్లి స‌జావుగా జ‌రిపిస్తాన‌ని సుబ్బు తండ్రి కండీష‌న్ పెడ‌తాడు. జాబ్‌, పెళ్లి కోసం మాకీపూర్ వెళ్లిన సుబ్బుకు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? సంతానోత్ప‌త్తి రేటు అధికంగా ఉన్న ఆ ఊరి ప్ర‌జ‌ల్లో సుబ్బు మార్పు తీసుకురాగ‌లిగాడా? శృంగారం పేరు ఎత్తితేనే కోపంతో ఊగిపోయే ఆ ఊరి ప్ర‌జ‌ల కార‌ణంగా సుబ్బుకు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? సెక్స్ ఎడ్యుకేష‌న్ మీద ఏ మాత్రం అవ‌గాహ‌న లేని ఆ ఊరి ప్ర‌జ‌ల‌కు సుబ్బు పాఠాలు చెప్పాడా? మాకీపూర్‌లో ప‌రిచ‌య‌మైన స్వాతి (మిథిలా పాల్క‌ర్‌) కార‌ణంగా సుబ్బు జీవితంలో ఎలాంటి మార్పు వ‌చ్చింది? స్వాతి, దివ్య‌ల‌లో ఎవ‌రిని పెళ్లిచేసుకున్నాడు? కొడుకు జాబ్ గురించి కుక్కుటేశ్వ‌ర‌రావుకు తెలిసిందా? లేదా? అన్న‌దే వెబ్ సిరీస్ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: సుబ్బు పాత్ర‌లో సందీప్ కిష‌న్ నాచుర‌ల్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇష్టం లేని ఉద్యోగం చేయ‌లేక‌, త‌న జాబ్ గురించి తండ్రికి చెప్ప‌లేక నిజానికి, అబ‌ద్దాల‌కు మ‌ధ్య న‌లిగిపోయే యువ‌కుడిగా మెప్పించాడు. చాలా వ‌ర‌కు ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే కామెడీని పండించాడు. ప‌ల్లెటూరి అమ్మాయిగా మిథిలా పాల్క‌ర్‌, సుబ్బుకు కాబోయే భార్య‌గా మాన‌స చౌద‌రి న‌ట‌న ఓకే. కొడుకును తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకొనే తండ్రిగా ముర‌ళీ శ‌ర్మ‌కు ఇలాంటి పాత్ర‌లు కొత్తేమీ కాదు. కొన్ని చోట్ల అత‌డి డైలాగ్స్‌, మాడ్యులేష‌న్ అల వైకుంఠ‌పుర‌ములో సినిమాను గుర్తుచేసింది. వేశ్య పాత్ర‌లో దివ్య పిళ్లై న‌ట‌న బాగుంది. సంపూర్ణేష్ బాబు పాత్ర బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. శీను, జీవ‌న్‌తో పాటు మాకీపూర్ ప్ర‌జ‌లుగా క‌నిపించిన వారంతా త‌మ కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: సెన్సిబుల్ పాయింట్‌ను కామెడీ జోడించి అర్థ‌వంతంగా చెప్పారు డైరెక్ట‌ర్ మ‌ల్లిక్ రామ్‌. ర‌మేష్ ఎలిగేటి, శివానీతో క‌లిసి మ‌ల్లిక్ రామ్ ఈ సిరీస్‌కు క‌థ‌ను అందించారు. ఈ సిరీస్‌కు అనుదీప్ దేవ్‌తో పాటు అచ్చు, య‌శ్వంత్ నాగ్‌, మ‌నోజ్ శ‌ర్మ క‌లిసి మ్యూజిక్ అందించారు. సుబ్బుగాడు బైలెల్లిండే పాట బాగుంది. నాచుర‌ల్ లోకేష‌న్స్‌లో షూట్ చేయ‌డం బాగుంది. నిజంగానే ప‌ల్లె జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఈ సిరీస్ కోసం సినిమా స్థాయిలో రాజీవ్ చిలుక‌, భ‌ర‌త్ ల‌క్ష్మిప‌తి బ‌డ్జెట్ పెట్టారు.

విశ్లేష‌ణ‌: సెక్స్ ఎడ్యుకేష‌న్ అంటే ఇప్ప‌టికీ చాలా మంది బూతుగానే భావిస్తుంటారు. ఫీమేల్ రీ ప్రొడ‌క్ష్టివ్ క్లాస్‌ల‌ను పిల్ల‌ల‌కు బోధించ‌డానికి సంశ‌యించే స్కూల్స్‌, టీచ‌ర్లు ఉన్నారు. సెక్స్ గురించి న‌లుగురిలో మాట్లాడ‌టానికి నామోషిగా చాలా మంది ఫీల‌వుతుంటారు. లైంగిక అంశాల ప‌ట్ల క‌నీసం అవ‌గాహ‌న లేకుండానే త‌ల్లిదండ్రులుగా మారిన వారు క‌నిపిస్తుంటారు. అలాంటి వారంద‌రికి సందేశాన్ని ఇచ్చేలా సూప‌ర్ సుబ్బు సిరీస్‌ను తెర‌కెక్కించారు మేక‌ర్స్‌. సెక్స్ అంటే బూతు కాద‌ని, మిగిలిన విష‌యాల‌తో పాటు లైంగిక విజ్ఞానం ప‌ట్ల అవ‌గాహ‌న ఉండ‌టం మంచిద‌నే సందేశాన్ని ఇచ్చారు.

ఈ సిరీస్ కోసం ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్‌రామ్ ఎంచుకున్న క‌థ చాలా క్లిష్ట‌మైంది. ఇలాంటి క‌థ‌ను చెప్ప‌డంలో ఏ మాత్రం గీత దాటినా అది బూతు కామెడీగా మారిపోతుంది. ఆ లిమిట్స్‌లో చెప్ప‌డానికి ద‌ర్శ‌కుడు చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. శానిట‌రీ ప్యాడ్స్ ఉప‌యోగం, ప్రెగ్నెన్సీ గురించి వివ‌రించే సీన్‌తో పాటు దివ్య పిళ్లై, సందీప్ కిష‌న్ మ‌ధ్య వ‌చ్చే సీన్ల‌లో ద‌ర్శ‌కుడు మెప్పించాడు. మాకీపూర్ గ్రామ ప్ర‌జ‌లు చేసే హ‌డావిడి న‌వ్విస్తుంది. కామెడీకి ఎక్క‌డ లోటు లేకుండా చూసుకున్నారు.

ఫోక‌స్ పాయింట్‌: న‌వ్విస్తూనే ఆలోచింప‌జేసే మంచి సిరీస్‌.

రేటింగ్: 2.5/5

 

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus