ప్రతి కథానాయిక పాత్రపై ఆసక్తి కనబరుస్తున్న సుప్రియ!

అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సమంత సోదరి అయిన సుప్రియ “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా ద్వారా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. పవన్ కళ్యాణ్ తో పోటీగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. తెర వెనుక కీలక బాధ్యతలు చేపట్టారు. “అన్నపూర్ణ స్టూడియోస్‌’ బ్యానర్‌లో వస్తున్న సినిమాలకు నిర్మాతగా సుప్రియ వ్యవహరించారు. 22 ఏళ్ళ తర్వాత మళ్లీ తెరపై కనిపించారు. అడవి శేష్, శోభిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన “గూఢచారి” సినిమాలో సుప్రియ రా ఆఫీసర్ నదియా ఖురేషి పాత్రలో నటించారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ఆమెకు అభినందనలు అందాయి. అందుకే న‌ట‌న‌పైపు కూడా దృష్టి పెట్టాల‌నుకుంటున్నారు.

ఇన్నాళ్ల గ్యాప్ త‌ర‌వాత మ‌ళ్లీ న‌టించ‌డానికి కారణంపై స్పందిస్తూ… ”అడ‌విశేష్ నాకు మంచి మిత్రుడు. త‌ను క‌థ చెప్పాడు. పాత్ర గురించి వివ‌రించాడు. అయితే ఇన్నాళ్ల తర్వాత మ‌ళ్లీ న‌టించ‌గ‌ల‌నా, లేదా? అనే సందేహం వ‌చ్చింది. అందుకే స్క్రీన్ టెస్ట్ చేయ‌మ‌ని అడిగాను. తెర‌పై చూసుకున్నాక సంతృప్తిక‌రంగా అనిపించింది. దాంతో… ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నా” అని రీ ఎంట్రీ గురించి సుప్రియ‌ వివరించింది. నటిగా కొనసాగడంపై మాట్లాడుతూ.. “మంచి క‌థ, పాత్ర వ‌స్తే.. త‌ప్ప‌కుండా న‌టిస్తా. నేను ప్ర‌తినాయ‌కురాలి పాత్ర‌ల‌కు బాగుంటాను. నెగిటీవ్ షేడ్స్ బాగా ప‌లికించ‌గ‌ల‌ను. అలాంటి పాత్రలొస్తే అభ్యంత‌రం చెప్ప‌ను” అని మనసులోని మాటను బయటికి చెప్పారు. పెద్ద సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ మంచి పాత్రలే కావాలని కోరుకోకుండా నెగటివ్ రోల్స్ చేస్తానని ముందుకొచ్చి ఫిలిం మేకర్స్ దృష్టిలో పడ్డారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus