తేజ్ ఐ లవ్ యూ

అయిదు వరుస ఫ్లాపుల తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం “తేజ్ ఐ లవ్ యు”. ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించడం విశేషం. సాయిధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం సాయిధరమ్ తేజ్ ఫ్లాపుల పరంపరకు అడ్డు కట్ట వేయగలిగిందా లేదా అనేది చూద్దాం..!!


కథ:
తేజ్ (సాయిధరమ్ తేజ్) ఇంట్లో, కాలేజ్ లో అందరికీ ఇష్టమైన కుర్రాడు. తొలిచూపులోనే ట్రైన్ లో తెల్ల బట్టలేసుకొన్న నందిని (అనుపమ పరమేశ్వరన్)ను ప్రేమిస్తాడు. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేసేలోపే వారిద్దరి మధ్య చిలిపి గొడవలు జరుగుతాయి. ఈ గొడవలు ముగిసేలోపు నందినికి తేజ్ మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది. తన ప్రేమను వ్యక్తపరుద్దామని తేజ్ కలవడం కోసం వెళుతున్న నందినికి ఓ యాక్సిడెంట్ కారణంగా కరెక్ట్ గా ఇండియాకి వచ్చినప్పట్నుంచి ఆ నిమిషం వరకూ గతం మొత్తం మరిచిపోతుంది.
ఆ గతంలో తన ప్రేమ కూడా ఉండడం, తన ప్రేమతోపాటు తనను కూడా నందిని మర్చిపోవడంతో బాధపడుతున్న తేజ్ తన ప్రేమను తిరిగిపొందేలా అతడి స్నేహితులు సహాయపడుతుంటారు.
స్నేహితుల ప్రయత్నాలు ఫలించాయా? నందినికి తాను తేజ్ మీద పెంచుకొన్న ప్రేమ గుర్తొచ్చిందా? లేక మళ్ళీ ప్రేమ పుట్టిందా? అనేది “తేజ్ ఐ లవ్ యూ” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.


నటీనటుల పనితీరు:
సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపుల కారణంగా ఢీలాపడ్డాడో లేక మరింకేదైనా కారణమో తెలియదు కానీ.. సినిమా మొత్తంలో ఎక్కడా పెద్ద ఎనర్జీటిక్ గా కనిపించడు. పైగా.. సీన్ టు సీన్ కి కనీసం మీస కట్టులో కూడా కంటిన్యుటీ లేకపోవడం, డ్యాన్సులు, ఫైట్లు పరంగానూ ఎక్కడా ఎనర్జీ కానీ ఒక స్టైల్ కానీ లేకపోవడం బాధాకరం. తేజ్ ఇలాగే కంటిన్యూ అయితే.. హీరోగా కెరీర్ కంచికి చేరడం ఖాయం.
అనుపమకి ఉన్న క్యూట్ ఇమేజ్ ఈ సినిమాతో పోయింది. నిన్నమొన్నటివరకూ అనుపమను చూసి “అమ్మాయి భలే క్యూట్ గా ఉంది” అంటూ మెచ్చుకొన్నవాళ్ళందరూ ఈ సినిమాలో అమ్మడి ఓవర్ యాక్షన్ & గ్రేస్ లేని డ్యాన్స్ లు చూసి జీర్ణించుకోవడం కష్టమే.
జయప్రకాష్, పవిత్ర లోకేష్, పృధ్వీ లాంటి సీజనల్ ఆర్టిస్ట్స్ ను ఈ సినిమాలో సరిగా వినియోగించుకోలేదు. ఏదో బ్యాగ్రౌండ్ నింపడానికి తప్ప వాళ్ళు పెద్దగా ఉపయోగపడలేదు.
వైవా హర్ష ఒక రెండు సీన్స్ లో తప్ప ఎక్కడా నవ్వించకపోవడం అటుంచి విచిత్రమైన కామెడీతో చిరాకు పుట్టించాడు.


సాంకేతికవర్గం పనితీరు:
ప్రేమకథలను అద్భుతంగా తీయగలడు అని తెలుగు ప్రేక్షకులు కరుణాకరన్ మీద పెట్టుకొన్న నమ్మకాన్ని ఆయన “తేజ్ ఐ లవ్ యూ”తో సమూలంగా నాశనం చేసేశాడు. ఆఖరికి ఆయన ఫ్లాప్ సినిమాల్లో ఒకటైన “యువకుడు” కూడా తేజ్ కంటే వంద రెట్లు బెటర్ గా ఉంటుంది. సినిమాలో ఒక ఎమోషన్ లేదు, ఫీల్ లేదు, ఇక హీరోహీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ అసలే లేదు. ఇక కామెడీ కోసం రాసుకొన్న లేదా క్రియేట్ చేసిన సన్నివేశాలన్నీ సహనాన్ని పరీక్షిస్తాయే తప్ప సినిమాకి ఏ రకంగానూ ప్లస్ అవ్వవు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. కొంపదీసి కరుణాకరణ్ సినిమాలు తీయడం మర్చిపోయారా ఏంటి? అనే డౌట్ రాక మానదు. ఆఖరికి “ఎందుకంటే ప్రేమంట” సినిమాలో కనీసం ఒక ఎమోషన్ ఉంటుంది.. తేజ్ సినిమాలో ఎమోషన్ మాత్రమే కాదు బూతద్దం పెట్టి వెతికినా కథ కనిపించదు.
కథకి, కంటెంట్ కి ప్రాధాన్యత ఇచ్చే సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఈ కథను ఎలా అంగీకరించారు అనేది ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ సస్పెన్స్ గా నిలుస్తుంది. ఇక కరుణాకరణ్ దర్శకత్వంతోపాటు గోపీసుందర్ సంగీతం-నేపధ్య సంగీతం కూడా ప్రేక్షకుల సహనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షిస్తుంది. ఒక్క పాట కూడా గుర్తుంచుకొనే రీతిలో లేదు, ఇక సదరు పాటల చిత్రీకరణ కూడా చాలా బద్ధకంగా ఉంటుంది. లండన్, ప్యారిస్ లో షూట్ చేస్తే ఏం లాభం, పాటలు వినడానికి కాకపోయినా చూడ్డానికైనా బాగుండాలి కదా. అసలు మాంటేజ్ సాంగ్స్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన కరుణాకరణ్ ఈ సినిమాలో తన మార్క్ ను ఎక్కడా చూపించకపోవడం గమనార్హం.
ఇక ఈ సినిమా విషయంలో ఎడిటింగ్, డి.ఐ, స్క్రీన్ ప్లే లాంటి విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది.

విశ్లేషణ:
“తేజ్ ఐ లవ్ యూ”తో సాయిధరమ్ తేజ్ సక్సెస్ ఫుల్ గా ఫ్లాపుల పరంగా సెకండ్ హ్యాట్రిక్ కంప్లీట్ చేశాడు. నిజానికి.. రామ్ చరణ్, అల్లు అర్జున్ తర్వాత మెగా ఫ్యామిలీలో హీరోగా నిలదొక్కుకోవడానికి కావాల్సిన లక్షణాలు వరుణ్ తేజ్ కంటే ఎక్కువగా ఉన్న కథానాయకుడు సాయిధరమ్ తేజ్. కానీ.. బ్యాడ్ స్క్రిప్ట్ సెలక్షన్, ప్రయోగాలు చేయడానికి కనీస ప్రయత్నం చేయకపోవడం వంటి కారణాలుగా వరుస అపజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తేజు ఇప్పటికైనా ఈ కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి వైవిధ్యమైన సినిమాలు చేస్తే తప్ప హీరోగా తన ఉనికిని కాపాడుకోవడం చాలా కష్టం.


రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus