పొలిటీషియన్స్ కంటే సినిమావాళ్లు చాలా డేంజరస్ : తేజ

  • July 8, 2020 / 12:01 PM IST

“నేను హిట్లు తీశాను, డిజాస్టర్లూ తీశాను, నా స్టామినా నాకు తెలుసు” ఇలాంటి మాటలు ఎలాంటి జంకూబొంకూ లేకుండా ఏ డైరెక్టర్ మాట్లాడతాడు చెప్పండి. తాను సినిమా జనాలు అర్ధం చేసుకోలేదు అని చెప్పుకొనే దర్శకులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ తరుణంలో నా సినిమా జనాలకి నచ్చలేదు అందుకే ఫ్లాప్ అయ్యింది అంటూ హుందాగా తన పరాజయాన్ని సైతం స్వాగతించే ఏకైక దర్శకుడు తేజ. ఆయన తీసిన సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ.. ఆయన మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “నేనే రాజు నేనే మంత్రి”. రాణా టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో కాజల్-కేతరీన్ లు కథానాయికలు. ఆగస్ట్ 11న విడుదలకానున్న ఈ చిత్ర విశేషాలను తేజ మీడియాతో పంచుకొన్నారు.

మా సినిమా పోలిటికల్ థ్రిల్లర్ కాదు..
సినిమా టైటిల్, టీజర్, పోస్టర్స్ చూసి అందరూ “నేనే రాజు నేనే మంత్రి” అనేది పోలిటికల్ థ్రిల్లర్ అనుకొంటున్నారు. నిజానికి మా సినిమా ఒక ప్రేమకథ. కాకపోతే పోలిటికల్ బ్యాక్ డ్రాప్ సాగుతుంది. పాత్రల స్వభావాలు చాలా సహజంగా ఉంటాయి. అదే మా సినిమా ప్రత్యేకత.

సురేష్ బాబు రాకతో చాలా మార్పులొచ్చాయి..
మొదట ఈ సినిమా “అహం” అనే పేరుతో రాజశేఖర్ హీరోగా చేద్దామనుకొని ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభించాం. అయితే ఆ సినిమా సెట్స్ కు వెళ్లలేదు. ఆ తర్వాత ఈ కథను సురేష్ బాబుకి చెప్పడం ఆయన కొన్ని మార్పులు చెప్పడంతో.. రాణాకి ఈ కథ బాగా సరిపోతుంది అనిపించి చెప్పడం జరిగింది. రాణా ఒకే చేసిన తర్వాత అతడి వయసుకు తగ్గట్లు కొన్ని మార్పులు చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాం.

కాజల్ కథ చెప్పగానే ఒకే చేసింది..
కాజల్ తో ఇదివరకే ఒక సినిమా కోసం పనిచేసి ఉండడంతో ఈ క్యారెక్టర్ ను ఆ అమ్మాయి సెట్ అవుతుంది అనిపించి కథ ఆ అమ్మాయికి చెప్పాను. కథ విన్న వెంటనే కాజల్ “ఇలాంటి క్యారెక్టర్ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం” అని అడిగింది. షూటింగ్ టైమ్ లో కూడా నేనొక ఎక్స్ ప్రెషన్ అడిగితే “లేదు, రాధ పాత్ర ఇలా బిహేవ్ చేస్తేనే బాగుంటుంది” అంటూ నాకే రివర్స్ లో చెప్పేది. కాజల్ ఆ క్యారెక్టర్ లో ఆ రేంజ్ లో ఇన్వాల్వ్ అయిపోయింది.

రాణాది నెగిటివ్ రోల్ కాదు..
సినిమాలో రాణాది నెగిటివ్ రోల్ అనుకొంటున్నారు చాలా మంది. చాలా సినిమాల్లో హీరో పాజిటివ్ క్యారెక్టర్ మాత్రమే చూపిస్తుంటారు. కానీ.. హీరో అనే కాదు ప్రతి మనిషిలోనూ నెగిటివ్ అనేది ఉంటుంది. మన సినిమాల్లో ఆ నెగిటివ్ సైడ్ ను చూపించరు. నేను నా సినిమాలో ఒక మనిషిలోని విభిన్నమైన స్వభావాన్ని తెరపై చూపిస్తున్నాను అంతే. రాణా చాలా ఇంటెలిజెంట్ యాక్టర్, రేపు షూటింగ్ లో సీన్ కోసం ఈరోజు నైట్ నుండే ఆ మూడ్ లోకి వచ్చేస్తాడు.

ఇదొక రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్ టైనర్..
ఒక ఆర్ట్ సినిమాకి కమర్షియల్ వేల్యూస్ యాడ్ చేసి తీస్తే ఎలా ఉంటుందో “నేనే రాజు నేనే మంత్రి” అలా ఉంటుంది. కథ కొత్తగా ఉండదు కానీ ట్రీట్ మెంట్ కాస్త కొత్తగా ఉంటుంది అంతే. మన సభ్యసమాజంలో ఇలాంటి కథలు చాలా చూసే ఉంటాం, కానీ తెరపై ఇలాంటి కథ చూడడం మాత్రం ఇదే మొదటిసారి.

రామానాయుడు గారి బ్యానర్ లో సినిమా చేయడం గర్వంగా ఉంది..
చిన్నప్పుడు రామానాయుడు గారి బ్యానర్ లో రూపొందిన సినిమాల పోస్టర్స్ చూస్తూ ఉండేవాడ్ని. వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాను, అలాంటిది ఆయన బ్యానర్ లో ఈరోజు ఒక సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది.

నాయుడుగారు బ్రతికుంటే సంతోషించేవారు..
సురేష్ బాబు సినిమాని చాలా బాగా ఎనలైజ్ చేస్తారు. ఆయన అంత ఈజీగా నచ్చదు అలాంటిది ఆయన “నేనే రాజు నేనే మంత్రి” ఫస్ట్ కాపీ చూసి “బాగుంది” అని చెప్పడం నాకు పెద్ద కాంప్లిమెంట్. ఆయన బాగుందని చెప్పడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యారు. ఆయనకి నచ్చిందంటే సినిమా హిట్ అని కొందరు డిసైడ్ అయిపోయారు కూడా. కానీ.. ఎంతమంది బాగుందని అన్నా సరే.. నాయుడుగారు బ్రతికి ఉంటే సినిమా చూసి, ముఖ్యంగా అందులో రానాని చూసి బాగా సంతోషించేవారు.

నాకు బెస్ట్ విజువల్స్ అవే..
ఫారిన్, ఊటీ లాంటి లొకేషన్స్ కి వెళ్ళి అక్కడి అందమైన ప్రదేశాలు చూసినా కలగని సంతోషం థియేటర్ లో సినిమా చూస్తూ ఆనందించే ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తే కలుగుతుంది. అదే నా జీవితంలో నేను చూసే బెస్ట్ విజువల్స్.

నా సినిమా రిజల్ట్స్ అన్నీ ఊహించినవే ఆ ఒక్కటి తప్ప..
నేను ఇప్పటివరకూ చూసిన అన్నీ సినిమాల రిజల్ట్స్ అవి ఫ్లాపైనా, హిట్తైనా నేను ముందే ఊహించాను. ఒక్క “నిజం” సినిమా రిజల్ట్ మాత్రమే ఊహించలేకపోయాను. సినిమాలో హీరోయిజమ్ తక్కువ సహజత్వం ఎక్కువగా ఉండడంతో జనాలు కనెక్ట్ అవ్వలేదు. అందువల్లే సినిమా ఫ్లాపయ్యింది.

పాత్రలు తెలివిగా ఉండాలి, సినిమా కాదు..
ఈమధ్య సినిమాలు ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసేసి ఇంటెలిజెంట్ సినిమా అనిపించుకోవడం కోసం ఆత్రపడిపోతున్నాయి. ఎప్పుడైనా సరే సినిమాలో పాత్రధారి తెలివిగా బిహేవ్ చేయాలి కానీ.. సినిమా కాదు. ఎప్పుడైతే ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ కాలేరో సినిమా ఎంత తెలివిగా ఉన్నా వేస్టే. అదే పాత్రధారులు తెలివిగా బిహేవ్ చేస్తే ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారు.

నెక్స్ట్ సినిమా ఇంకా ఫిక్స్ అవ్వలేదు..
ఒక సినిమా రిలీజ్ కి ముందే ఇంకో సినిమా ఓకే చేసుకోవడం అనేది నా కెరీర్ లో ఇప్పటివరకూ జరగలేదు. ఇకపై జరగదు కూడా. అయినా సినిమా విడుదలకు ముందు ఒకలా ఉంటారు, “నేనే రాజు నేనే మంత్రి” ట్రైలర్ చూసి చాలామంది నిర్మాతలు సూట్ కేసులు పట్టుకొని నా దగ్గరికొచ్చారు. అయితే.. నా దృష్టిలో సినిమావాళ్లు పొలిటీషియన్స్ కంటే డేంజరస్. ప్రతి శుక్రవారం పార్టీ మార్చేస్తుంటారు. మరీ ముఖ్యంగా మ్యాట్నీ షో టైమ్ కి మాటలు మార్చేస్తుంటారు. అందుకే నేను విడుదలకు ముందు అడ్వాన్స్ లు ఇచ్చేవాళ్లని ఎక్కువగా నమ్మను.

– Dheeraj Babu 


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus