థియేటర్ల వద్ద టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి పెద్ద సినిమా రిలీజ్ టైమ్‌లో చివరి నిమిషంలో రేట్లు పెంచి ఆడియన్స్‌పై భారం వేసే పద్ధతికి కోర్టు చెక్ పెట్టింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇవ్వడంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ముఖ్యంగా సామాన్య ప్రేక్షకుడి హక్కులను కాపాడటమే లక్ష్యంగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ప్రభుత్వ హోంశాఖ తీసుకున్న కొన్ని నిర్ణయాలే. సినిమా బడ్జెట్ లెక్కలు, ఇతర ఖర్చులను సరిగ్గా పరిశీలించకుండానే టికెట్ రేట్లు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని పిటిషనర్ విజయ్ గోపాల్ వాదించారు. దీనివల్ల సామాన్య జనానికి సినిమా చూడటం భారంగా మారుతోందని ఆయన ఆరోపించారు. నిర్మాతల నుంచి సరైన అఫిడవిట్లు కూడా తీసుకోకుండా ఈ ప్రక్రియ జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రీసెంట్ సంక్రాంతి సినిమాలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో విచారణ జరుగుతున్న టైమ్‌లోనే అర్ధరాత్రి పూట మెమోలు జారీ చేస్తూ రేట్లు పెంచడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలను పక్కన పెట్టి టికెట్ ధరలు పెంచినందుకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది. ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఇకపై ఏ సినిమాకైనా సరే టికెట్ ధరలు పెంచాలంటే సినిమా రిలీజ్‌కు కనీసం 90 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. చివరి నిమిషంలో హడావుడిగా జీవోలు ఇచ్చే పద్ధతికి ఫుల్‌స్టాప్ పెట్టింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్-1955 ప్రకారం ఈ 90 రోజుల నిబంధనను పక్కాగా ఫాలో అవ్వాల్సిందేనని జడ్జిమెంట్ ఇచ్చింది. దీనివల్ల రేట్ల పెంపు విషయంలో పారదర్శకత పెరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలతో భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాల మేకర్స్‌కు గట్టి టాస్కే ఎదురుకానుంది. ఒకవేళ ఈ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.