‘బహుబలి’ సినిమాల తర్వాత ప్రభాస్ (Prabhas) సినిమాలకు భారీ అంచనాలు ఏర్పడటం కొత్త విషయమేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఇలానే జరుగుతూ వస్తోంది. అన్ని అంచనాలతో వచ్చిన సినిమాల్లో ‘సలార్’ సినిమా ఒక్కటే ఆశించిన మేర వసూళ్లు, టాక్ అందుకుంది. మరో సినిమా టాక్ లేకపోయినా మంచి వసూళ్లు అందుకుంది అదే ‘సాహో’. అయితే ఆడని ప్రతి సినిమాకూ ఓ స్పష్టమైన కారణం ఉంది. ఇప్పుడు ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి నిర్మాత విశ్వప్రసాద్ మరో కారణం చెప్పారు.
ప్రభాస్ అభిమానులను ఇప్పటికీ, ఎప్పటికీ ఇబ్బంది పెట్టే సినిమాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. ఆ సినిమాకు దర్శకుడు, అతని సన్నిహిత గణం ఇచ్చిన ఓవర్ హైప్ వల్లనో, సినిమా విషయంలో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ విషయంలో వచ్చిన విమర్శల వల్లనో, టెక్నాలజీతో రూపొందించిన ప్రధాన సన్నివేశాల విషయంలో దొరికిపోవడం వల్లనో కానీ.. ఆ సినిమా దారుణమైన ఫలితం అందుకుంది. అయితే ఇప్పుడు నిర్మాత మరో మాట చెప్పారు.
‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రెస్ మీట్లో నిర్మాత విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మాట్లాడుతూ ‘రాజా సాబ్’ సినిమా వేరే సీజన్ లో వచ్చి ఉంటే రిజల్ట్ మారేదని, సంక్రాంతి సీజన్లో రావడం వల్ల అనుకున్న ఫలితం దక్కలేదని చెప్పారు. దీంతో సీజన్ మారితే వాతావరణం మారుతుంది కానీ.. సినిమా ఫలితం ఎలా మారుతుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి సంక్రాంతికి సినిమా రావడం వల్లనే ఆ మాత్రం వసూళ్లైనా వచ్చాయి అనేది మరో వాదన. మిగిలిన రోజుల్లో వచ్చుంటే ఈ మాత్రం కలెక్షన్లు కూడా వచ్చేవి కావనే వాదనా ఉంది.
అన్నట్లు ఈ సినిమా ఫలితం కారణంగానేమో విశ్వప్రసాద్కు ప్రభాస్ మరో సినిమా చేస్తానని ఒప్పుకున్నారట. 2028లో ఆ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. దీని కోసం దర్శకులు, రచయితల కథలు వింటున్నారట విశ్వప్రసాద్. మరి ఎవరి కథకు ఓకే ముద్ర పడుతుందా? కొబ్బరికాయ విరుగుతుందా అనేది చూడాలి.